మోదీని ఓడించలేం అన్నారు: రాహుల్‌

11 May, 2019 16:19 IST|Sakshi

భోపాల్‌: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ సవాల్‌ విసిరారు. మోదీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్చించేందుకు తనతో బహిరంగ చర్చకు సిద్ధమా అని అన్నారు. ఐదేళ్ల మోదీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, మరోసారి ఆయనను బరించే ఓపిక ఈ దేశ ప్రజలకు లేదని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. నోట్లరద్దు, జీఎస్టీ, గూడ్స్‌ సర్వీస్ టాక్స్‌, రైతాంగ సంక్షోభం కారణంగా దేశం తీవ్ర దుర్భిక్ష పరిస్థితిని ఎదుర్కొంటోందని అన్నారు. ఐదేళ్ల క్రితం ఎవరిని కదిలించినా.. మోదీని ఓడించడం ఎవరివల్ల కాదని అనేవారని, కానీ ఇప్పుడు మోదీ గెలవడం అసంభవం అని అంటున్నారని చెప్పుకొచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మధ్యప్రదేశ్‌లోని శుజాల్‌పూర్‌లో రాహుల్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఓన్యూస్‌ ఛానెల్‌తో రాహుల్ మాట్లాడారు. ‘అచ్ఛే దిన్‌ ఆయేంగే’ అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని రాహుల్‌ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్న మోదీ అచ్ఛే దిన్‌ గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదన్నారు. అలాగే యువతకు ఉపాధి, రైతు సమస్యల గురించి ఎక్కడా మాట్లాడడం లేదన్నారు. ద్వేషాన్ని ద్వేషంతో కాకుండా ప్రేమతోనే జయించాలని మోదీకి హితవు పలికారు. 

బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ సిద్ధాంతాలతోనే తమకు వైరుధ్యమని, వ్యక్తిగతంగా తమకు శత్రువులెవ్వరూ లేరని స్పష్టం చేశారు. దేశ ప్రజలను ప్రేమించడం ప్రధాని మోదీకి తెలీదని, ప్రేమగా మాట్లాడం కూడా ఆయనకు రాదని అన్నారు. దేశాన్ని, రాజ్యాంగ సంస్థలను కాపాడడం కోసం తమ పోరాటం సాగిస్తామని తెలిపారు. భవిష్యత్తు ప్రధాని ఎవరనేదానికి రాహుల్‌ స్పందిస్తూ.. ప్రస్తుతం తమ దృష్టంతా మోదీని ఓడించడమేనని, ప్రజల అభిష్టం మేరకే ప్రధాని ఎన్నిక ఉంటుందని చెప్పుకొచ్చారు. యూపీలో మహాకూటమి వల్ల తమకేమీ నష్టం లేదని, మాయావతి అంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు.  


 

మరిన్ని వార్తలు