బీజేపీ అంటే రాహుల్‌కు భయం: మురళీధర్‌రావు

30 Jun, 2019 08:51 IST|Sakshi

బీజేపీ అంటే రాహుల్‌కు భయం: మురళీధర్‌రావు

సాక్షి, సంగారెడ్డి: దేశమంతా భారతీయ జనతాపార్టీ వైపు చూస్తోందని, తమ పార్టీని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చూసి రాహుల్‌ గాంధీకి భయం పట్టుకున్నదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవో భవన్‌లో శనివారం ‘సంస్థాగత పథం–సభ్యత్వ నమోదు–2019 సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మురళీధర్‌రావు మాట్లాడుతూ..స్వాతంత్య్రం వచ్చిన తరువాత వరుసగా రెండోసారి కాంగ్రెసేత ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిందన్నారు.

భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నడూలేని విధంగా సంస్థాగతంగా బలపడుతోందని చెప్పారు. దీంతో పార్టీ ఎదుగుదల, ప్రధాని నరేంద్ర మోదీకి వస్తున్న ఆదరణ చూసి జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఉన్న రాహుల్‌ గాంధీ ఆ పదవిని వదులుకుంటున్నారని అన్నారు. కొన్ని పార్టీలు కులాలు, మతాలపేరుతో నడుస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఒక్క బీజేపీయే కార్యకర్తలు నడిపించే సిద్ధాంతం గల పార్టీ అని పేర్కొన్నారు. జనసంఘ్‌ పేరుతో ప్రారంభమైన బీజేపీ అంచెలంచెలుగా ఎదిగి వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఉన్నత స్థానానికి ఎదిగిందన్నారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నారు. ఆపార్టీ నిజాం, రజాకార్ల వారసులకు తొత్తుగా మారిందన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ కోరుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌ బీమా యోజన, ఆయుష్మాన్, ప్రధానమంత్రి ఆవాస్‌యోజన తదితర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయడంలేదని ఆరోపించారు. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పటిష్టంగా సభ్యత్వ నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా