రాహుల్‌పై ముగ్గురు గాంధీల పోటీ..!

7 Apr, 2019 10:01 IST|Sakshi

వయనాడ్‌లో నామినేషన్‌ వేసిన మరో ముగ్గురు గాంధీలు

తిరువనంతపురం: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌ లోక్‌సభ స్థానంలో విచిత్రమైన పోటీ నెలకొంది. రాహుల్‌తో పాటు గాంధీ పేరుగల మరో ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. కేరళలోని వయనాడ్‌ పార్లమెంట్‌ స్థానానికి రాహుల్‌ నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే లోపు వయనాడ్‌ స్థానంలో రాహుల్‌ గాంధీతో పాటు మరో ముగ్గురు గాంధీలు పోటీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో కొట్టాయంలోని ఎరుమెలి గ్రామానికి చెందిన రాహుల్‌ గాంధీ కేఈ అనే యువకుడు ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేశారు.

రాహుల్ గాంధీ కేఈ సంప్రదాయ సంగీతంలో రీసెర్చ్ స్కాలర్. అతడి సోదరుడి పేరు రాజీవ్ గాంధీ కేఈ. వారి నాన్న కుంజుమన్ డ్రైవర్, కాంగ్రెస్ కార్యకర్త. గాంధీ కుటుంబానికి అభిమాని అని స్థానికులు చెబుతున్నారు. మక్కల్‌ ఖగజం పార్టీకి చెందిన కె.రఘుల్‌ గాంధీ కూడా రాహుల్‌పై పోటీకి నిలిచారు. వయనాడ్‌ సమీపానికి చెందిన కేఎమ్‌ శివప్రసాద్‌ గాంధీ కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. శివప్రసాద్‌ సంస్రృత టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఎన్నికల అఫడవిడ్‌లో​ తెలిపిన వివరాల ప్రకారం వీరంతా సామాన్య కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు పోటీచేస్తుండడంతో కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు కూడా ఈ స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.

కాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వయనాడ్‌తో పాటు యూపీలో అమేథిలో కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని తన సిట్టింగ్‌ స్థానం అమేథీలో ఓటమి భయంతోనే.. ప్రస్తుత ఎన్నికల్లో రాహుల్‌ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. ఇక మరోవైపు బీజేపీని ఎదుర్కొనే సత్తా లేకనే కమ్యునిస్ట్‌లు బలంగా ఉండే స్థానాన్ని రాహుల్‌ ఎంచుకున్నారని సీపీఎం అగ్రనేత ప్రకాశ్‌ కారత్‌ ఆరోపించారు. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత ఎంఐ షానవాజ్‌ ఇక్కడ గెలుపొందిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు