అధ్యక్షుడిగా రాహుల్‌.. సాయంత్రమే ప్రకటన?

4 Dec, 2017 11:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు స్వీకరించే తరుణం ఆసన్నమైంది. కాసేపటి క్రితం (సోమవారం ఉదయం) ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహాన్‌ సింగ్‌, పలువురు సీనియర్‌ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

రాహుల్‌ గాంధీ పేరును ప్రస్తుత అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్‌ నేత మన్మోహాన్‌ సింగ్‌ ప్రతిపాదించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 17న పోలింగ్‌, 19న ఓటింగ్‌ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా పోటీ లేకపోవటంతో ఈ సాయంత్రమే రాహుల్‌ పేరును అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. నాలుగు సెట్ల రాహుల్‌ నామినేషన్‌ పత్రాలపై 40 మంది నేతలు సంతకాలు చేయగా.. రాహుల్‌ను ప్రతిపాదిస్తూ 93 నామినేషన్లు దాఖలయ్యాయి.

ప్రతీ రాష్ట్రం నుంచి ఆయనకు మద్దతుగా నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడి పదవిలో కొనసాగుతుండగా..  నెహ్రూ కుటుంబం నుంచి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన జాబితాలో రాహుల్‌ చేరబోతున్నాడు. ఇక అత్యధిక కాలం ఏఐసీసీ అధ్యక్షురాలిగా పని చేసిన రికార్డు సోనియా గాంధీ(దాదాపు 20 ఏళ్లు) పేరిట ఉంది. ఒకవేళ నేడు కుదరకపోతే 11వ తేదీన రాహుల్‌ను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 

నామినేషన్‌ వేసిన అనంతరం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మోసినా కిద్వై, షీలా దీక్షిత్ లాంటి కురువృద్ధ నేతలతో రాహుల్‌ కాసేపు ముచ్చటించారు. రాహుల్‌ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వానికి సరైన వ్యక్తి అని ఈ సందర్భంగా పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు. పలువురు సీనియర్‌ నేతలు రాహుల్‌కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు