సుప్రీంకు రాహుల్‌ మరో‘సారీ’

30 Apr, 2019 03:08 IST|Sakshi

రఫేల్‌ తీర్పు వ్యాఖ్యలకుగాను.. కోర్టును రాజకీయ వివాదంలోకి లాగుతున్నారని విమర్శ  

న్యూఢిల్లీ: చౌకీదార్‌ చోర్‌ హై అన్న తన వ్యాఖ్యలను రఫేల్‌ కేసులో తీర్పుకు తప్పుగా ఆపాదించడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు మరో తాజా అఫడవిట్‌ దాఖలు చేశారు. తనపై ధిక్కార పిటిషన్‌ దాఖలు చేయడం ద్వారా.. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి తన రాజకీయ లబ్ది కోసం కోర్టును రాజకీయ వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్‌ విమర్శించారు. ధిక్కార పిటిషన్‌ను కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. ముమ్మర ఎన్నికల ప్రచార వేడిలో తానా వ్యాఖ్యలు చేశానని, సుప్రీంకోర్టు తీర్పులను తప్పుగా వక్రీకరించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

రఫేల్‌ కేసులో కోర్టు ఉత్తర్వులను  చదవకుండానే ఎన్నికల వేడిలో మాటలన్నానని తెలిపారు. తన మాటలను ప్రత్యర్థి పార్టీలు ఉపయోగించుకున్నాయని, దుర్వినియోగం చేశాయని విమర్శించారు. తాను 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఒక బాధ్యతాయుతమైన రాజకీయ, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తినని పేర్కొంటూ.. కోర్టు ప్రక్రియపై తప్పుడు ప్రభావం చూపించే లేఖి పిటిషన్‌ను తోసిపుచ్చాలని విజ్ఞప్తి చేశారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వాటిపై విచారం వ్యక్తం చేస్తూ తొలిసారి ఏప్రిల్‌ 22న రాహుల్‌ కోర్టులో అఫడవిట్‌ దాఖలు చేశారు.  

విచారణను వాయిదా వేయాలన్న కేంద్రం
గత డిసెంబర్‌ 14 నాటి రఫేల్‌ కేసు తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం నాటి విచారణను వాయిదా వేయాలని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టును కోరింది. పార్టీల రివ్యూ పిటిషన్లపై స్పందించేందుకు సమయం కావాలని తన లేఖలో పేర్కొంది. కాగా ఈ మేరకు సంబంధిత పార్టీలకు లేఖను పంపిణీ చేసేందుకు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతించింది.

సభలో ‘చౌకీదార్‌’ చొక్కాలు
చురు/ధోల్‌పూర్‌ (రాజస్తాన్‌): రాజస్తాన్‌లోని చురు జిల్లా సర్దార్‌ షహర్‌లో రాహుల్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు ‘మై భీ చౌకీదార్‌’అని రాసున్న టీషర్ట్‌లను ధరించిన కొందరు యువకులు హాజరయ్యారు. వారిని స్వాగతిస్తామని రాహుల్‌ తెలిపారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ‘తాము అధికారంలోకి రాగానే 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చౌకీదార్‌ గారు ప్రమాణం చేశారు. మీలో ఎవరికైనా ఆ ఉద్యోగాలు వచ్చాయా’అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే అందరి బ్యాంకు అకౌంట్లలో రూ. 15 లక్షలు డిపాజిట్‌ చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని.. మీలో ఎవరికైనా ఆ మొత్తం వచ్చిందా అని ప్రజలను ప్రశ్నించారు. జైపూర్‌ గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గంలో రాహుల్‌ ప్రచారం చేస్తూ ‘రఫేల్‌పై ఒక విచారణ జరగనుంది. ఇద్దరి పేర్లు బయటకు వస్తాయి. ఒకటి అనిల్‌ అంబానీ, రెండు నరేంద్ర మోదీ’ అని అన్నారు.

>
మరిన్ని వార్తలు