బెంగళూరుపై మోదీ కక్ష సాధింపు: రాహుల్‌

10 May, 2018 02:16 IST|Sakshi
బెంగళూరులో వస్త్రపరిశ్రమ కార్మికులతో రాహుల్‌ కరచాలనం

సాక్షి, బెంగళూరు: ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ బెంగళూరుపై కక్ష సాధిస్తున్నారు. సిలికాన్‌ సిటీని చెత్త నగరంగా మార్చారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఇక్కడ ఎన్నోమార్లు పర్యటించినా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు’ అని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన బెంగళూరు నగరంలో రోడ్‌ షో నిర్వహించారు. పలుచోట్ల తన ప్రసంగాల్లో మోదీపై ఎదురుదాడికి దిగారు. మోదీ ప్రసంగాలకు ఎవరూ మోసపోరన్నారు. మోదీ ప్రధాని పదవిలో ఉన్నాననే సంగతి మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఈ ఎన్నికల్లో కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు 2019లో తాను ప్రధాని కూడా అవుతానని పునరుద్ఘాటించారు.హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా కాంగ్రెస్‌లో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. అవినీతి, అక్రమాలతో కూరుకుపోయిన బీజేపీకి అవకాశం ఇవ్వరాదని ప్రజలను కోరారు. అనంతరం బసవనగుడిలో ప్రాచీన దొడ్డ గణపతి ఆలయంలో రాహుల్‌ పూజలు చేశారు. చిక్కపేటె ప్రాంతంలో హజరత్‌ మసీదులో ప్రార్థనల్లో పాల్గొన్నారు. అవినీతి విషయంలో కర్ణాటకలో ప్రస్తుత కాంగ్రెస్‌పై గత బీజేపీ పాలనే తేలిగ్గా విజయం సాధిస్తుందని రాహుల్‌ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ హయాం (2008–13)లో జరిగిన అవినీతిని, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనతో పోల్చుతూ పలు గణాంకాలను ట్విటర్‌లో విడుదల చేశారు.
 

>
మరిన్ని వార్తలు