వెనక్కు తగ్గని రాహుల్‌

30 May, 2019 04:30 IST|Sakshi

రాజీనామా ఉపసంహరణ కోసం పెరుగుతున్న ఒత్తిళ్లు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోనంటూ పట్టుబట్టడంతో ఆ పార్టీలో అనిశ్చితి బుధవారం కొనసాగింది. మరోవైపు రాహుల్‌ తన రాజీనామాను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుతూ పార్టీ కార్యకర్తలు కొందరు ఆయన ఇంటి ఎదుట నిరాహార దీక్షకు దిగారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతంలో విడిచిపెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి పాలైనందున తాను అధ్యక్ష పదవిలో ఉండనంటూ రాహుల్‌ రాజీనామా చేస్తాననడం, పార్టీ నేతలు దీనిని వ్యతిరేకించి ఆయనను బుజ్జగిస్తుండటం తెలిసిందే.

రాహుల్‌ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా బుధవారం కూడా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షీలా దీక్షిత్‌ కోరారు. ఆమెతోపాటు ఢిల్లీ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో రాహుల్‌ నివాసం వద్దకు చేరుకున్నారు. ‘మేమంతా రాహుల్‌ కోసమే ఉన్నాం. ఆయన తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలి. ఆయనే పార్టీకి సారథ్యం వహించాలని పార్టీ నేతలంతా కోరుకుంటున్నందున పార్టీని వీడొద్దని నేను చెప్పాను’ అని షీలా అన్నారు. కర్ణాటక, రాజస్తాన్‌ పీసీసీలు, పలు రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు.

జూన్‌ 1న సీపీపీ భేటీ
పార్లమెంటరీ పార్టీ కొత్త నేతను ఎన్నుకునేందుకు తాజా లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలిసారిగా కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) భేటీ జూన్‌ 1న జరగనుంది. ప్రస్తుతం సీపీపీ చైర్మన్‌గా సోనియా గాంధీ ఉన్నారు. కొత్త లోక్‌సభకు ఎన్నికైన 52 మంది ఎంపీలు, రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీలు ఈ భేటీకి హాజరుకానున్నారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమవుతారు. పార్లమెంటు సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానంపై వారు చర్చిస్తారు.

మరిన్ని వార్తలు