రాహుల్‌ విమానంలో ఇంజన్‌ సమస్య

27 Apr, 2019 03:29 IST|Sakshi

పట్నాకు బయలుదేరి మధ్యలోనే ఢిల్లీకి తిరిగొచ్చిన ఫ్లైట్‌  

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఢిల్లీ నుంచి పట్నాకు శుక్రవారం ప్రయణిస్తుండగా ఆయన విమానంలో ఇంజన్‌ సమస్యతో విమానాన్ని మళ్లీ ఢిల్లీకి తీసుకురావాల్సి వచ్చింది. ఈ ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ దర్యాప్తునకు ఆదేశించింది. ఉదయం 10.20 గంటలకు విమానం సురక్షితంగా ఢిల్లీకి తిరిగొచ్చిందని, అప్పుడు విమానంలో సిబ్బందితో కలిపి పది మంది ఉన్నారని అధికారి చెప్పారు. ఇంజిన్‌లో సమస్య కారణంగా ఢిల్లీకి తిరిగి రావాల్సి వచ్చిందని చెబుతూ రాహుల్‌ గాంధీ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఈ సమస్య వల్ల శుక్రవారం బిహార్‌లోని సమస్తీపూర్‌లో, ఒడిశాలోని బాలాసోర్‌లో, మహారాష్ట్రలోని సంగమ్‌నేర్‌లో తాను పాల్గొనాల్సిన సమావేశాలు ఆలస్యమవుతాయనీ, అసౌకర్యం కలిగిస్తున్నందుకు క్షమించాలని ట్విట్టర్‌లో రాహుల్‌ కోరారు. అనంతరం సమస్తీపూర్‌లో ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్‌తో కలిసి రాహుల్‌ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్‌ శుక్రవారం తనలాంటి పేరుతోనే ఉన్న మరో యువకుడిని కలుసుకున్నారు. బిహార్‌లోని సమస్తీపూర్‌లో ఓ సభలో ఆయన మాట్లాడుతూ అక్కడికొచ్చిన జనంలో ఒక యువకుడిని నీ పేరేంటి అని అడిగారు. అతను తన పేరు రాహుల్‌ అని చెప్పడంతో ప్రజలంతా ఉత్సాహంగా అరిచారు. అనంతరం రాహుల్‌ అతణ్ని వేదిక పైకి పిలిపించి, ఇతర నాయకులకు పరిచయం చేశారు.

మరిన్ని వార్తలు