రాజీనామా బాటలో రాహుల్‌ టీం

8 Jul, 2019 02:36 IST|Sakshi
జ్యోతిరాదిత్య సింధియా, మిలింద్‌ దేవ్‌రా

తప్పుకున్న సింధియా, మిలింద్‌ దేవ్‌రా

భవిష్యత్తుపై అనిశ్చితే కారణం

మళ్లీ తెరపైకొస్తున్న సీనియర్లు

న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేయడంతో ఆయన బృందం (టీం రాహుల్‌) కూడా అదే బాట పడుతోంది.ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా, ముంబై రీజనల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మిలింద్‌ దేవ్‌రాలు ఆదివారం తమ పదవులకు రాజీనామా చేశారు. యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేశవ్‌ చాంద్‌ శనివారం రాజనామా చేయగా, ఏఐసీసీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు నితిన్‌ రాత్‌ అంతకు ముందే పదవి నుంచి వైదొలిగారు.

యువశక్తితో పార్టీని పునరుత్తేజితం చేయాలన్న కోరితో రాహుల్‌ గాంధీ వీరిని ఏరి కోరి మరీ వీరికి కీలక పదవులు అప్పగించారు. రాహుల్‌ మార్గదర్శకత్వంలో నడిచి పార్టీకి పూర్వ వైభవం తేవాలన్న తపనతో వారు పెద్ద బాధ్యతల్ని తలకెత్తుకున్నారు.అయితే, ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పేలవమైన పనితీరు కనబరచడం, ఎన్నికల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఈ యువనేతల పని అగమ్యగోచరమయింది.

అందుకే రాహుల్‌కు సంఘీభావంగా, పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వీరు కూడా రాజీనామాలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, గోవా కాంగ్రెస్‌ అధ్యక్షుడు గిరీష్‌ చొదాంకర్, ఢిల్లీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ లిలోతియా కూడా పదవులకు రాజీనామా చేశారు. వీరంతా రాహుల్‌ బృందం సభ్యులే కావడం గమనార్హం. ‘రాహుల్‌  ఆశయ సాధన కోసమే మేం కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టాం. ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో చుక్కాని లేని నావలయ్యాం. పార్టీలో మా భవిష్యత్తు ఏమిటో అర్థం కాక రాజీనామా చేశాం’అన్నారు ఓ యువ నాయకుడు.

రాహుల్‌ హయాంలో నిశ్శబ్ధంగా ఉన్న సీనియర్లు ఇప్పుడు పార్టీలో కీలక పాత్ర పోషించేందుకు ముందుకొస్తున్నారు. రాహుల్‌ రాజీనామా విషయం, పార్టీ భవిష్యత్తుపై ఇటీవల జరిగిన చర్చల్లో అహ్మద్‌ పటేల్, గులాం నబీ ఆజాద్, మోతీలాల్‌ ఓరా, ఆనంద్‌ శర్మ,, భూపీందర్‌ సింగ్‌ హూడా వంటి తలనెరిసిన పెద్దలే పాల్గొన్నారు. ఇందులో యువ నాయకులెవరికీ అవకాశం కల్పించలేదు. కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో తాము జోక్యం చేసుకోబోమని రాహుల్‌ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ వర్కింగ్‌ కమిటీలో కూడా అంతా పెద్దలే ఉన్నారు. దీన్ని బట్టి పార్టీలో ముందుముందు వారిదే పైచేయిగా కనబడుతోంది. రాహుల్‌ బృందం రాజీనామాలకు ఇదీ ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

మరిన్ని వార్తలు