వ్యతిరేకించినందుకే వేటాడుతోంది

7 Jul, 2019 04:12 IST|Sakshi

పరువునష్టం కేసులో బెయిలు సందర్భంగా మోదీ సర్కార్‌పై రాహుల్‌ ధ్వజం

పట్నా: తమ విధానాలను వ్యతిరేకించే వారిని మోదీ ప్రభుత్వం వేటాడుతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రభుత్వ విధానాలు, బీజేపీ–ఆరెస్సెస్‌ వైఖరికి వ్యతిరేకంగా గొంతు విప్పినందుకే తనపై కక్ష కట్టి కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన పోరాటాన్ని కొనసాగిస్తానని శనివారం నాడిక్కడ విలేకరులకు స్పష్టం చేశారు. బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీ ఇక్కడి మేజిస్ట్రేట్‌ కోర్టుకు హాజరయ్యారు.కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. బెయిలు పొందాకా బయటకు వచ్చిన రాహుల్‌ కోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ‘దేశంలో పేదలు, రైతులు, కార్మికుల తరఫున పోరాడాలని నిర్ణయించుకున్నా.

వారికి సంఘీభావం తెలియజేయడం కోసమే ఇక్కడికి వచ్చాను. మోదీ ప్రభుత్వం,బీజేపీ,ఆరెస్సెస్‌లకు వ్యతిరేకంగా గొంతెత్తే వారందరినీ కోర్టు కేసులతో ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని ఇబ్బందులొచ్చినా నా పోరాటం కొనసాగుతుంది’ అని రాçహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. తనను వేధించడాని కి, భయపెట్టడానికే బీజేపీ, ఆరెస్సెస్‌ల్లో ఉన్న తన రాజకీయ ప్రత్యర్థులు ఈ పరువు నష్టం కేసులు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. గత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ ‘దొంగలందరి ఇంటి పేరూ మోదీ అనే ఎందుకుంటుందో’అని వ్యాఖ్యానించారు. రాహుల్‌ వ్యాఖ్యకు నిరసిస్తూ సుశీల్‌కుమార్‌ ఆయనపై పరువునష్టం దావా వేశారు. రాహుల్‌ తన నేరాన్ని ఒప్పుకోకపోవడంతో జడ్జి కేసు విచారణను ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేశారు.

>
మరిన్ని వార్తలు