బీజేపీకి దేశం బంగారు బాతు

17 Aug, 2018 02:12 IST|Sakshi
అభివాదంచేస్తున్న రాహుల్‌. చిత్రంలో మన్మోహన్, శరద్‌యాదవ్, ఏచూరి, సురవరం

ప్రభుత్వ ధ్యాసంతా మిత్రులకు, పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టడంపైనే

ప్రతిపక్షాల సమావేశంలో నిప్పులు చెరిగిన రాహుల్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని గంగానది అంత పవిత్రంగా చూస్తుంటే బీజేపీ మాత్రం దేశాన్ని బంగారు బాతులా చూస్తోందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ విమర్శించారు. దేశంలోని సంపదను తన స్నేహితులకు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన సంజీ విరాసత్‌ బచావో సమ్మేళన్‌ కార్యక్రమానికి రాహుల్‌ హాజరై మాట్లాడారు. జేడీయూ బహిష్కృత నేత శరద్‌ యాదవ్‌ ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ, జేడీఎస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఆర్‌ఎల్డీ, ఎన్సీపీ సహా 15 ప్రతిపక్ష పార్టీలకు చెందిన  ముఖ్య నేతలంతా పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలు, రైతులను అస్సలు పట్టించుకోవడం లేదని రాహుల్‌ ఆరోపించారు. ఈ బంగారు బాతును బంధించేందుకు బీజేపీ పంజరాన్ని తయారుచేస్తోందని, దీన్ని అడ్డుకునేందుకు తాము సర్వశక్తులా పోరాడతామని స్పష్టం చేశారు. తాము బీజేపీ ముక్త్‌ భారత్‌ను కోరుకోవడం లేదని, బీజేపీని నాశనం చేయాలనుకోవడం లేదని రాహుల్‌ అన్నారు. తమ సిద్ధాంతాలు, భావజాలం బీజేపీ కంటే బలమైనవని మాత్రమే నిరూపించాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే ప్రతిపక్షాలన్నీ కలసి రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ సహా దేశమంతా బీజేపీని ఓడిస్తాయని రాహుల్‌ జోస్యం చెప్పారు.

అలాగే రూ.524 కోట్ల విలువైన ఒక్కో రాఫెల్‌ యుద్ధ విమానానికి కేంద్రం రూ.1,600 కోట్లు చెల్లిస్తోందని దుయ్యబట్టారు. ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ఒక్కో వాక్యం పూర్తిచేశాక మోదీ అక్కడ ఉన్న టీచర్లవైపు చూస్తారనీ, దీంతో వాళ్లు పిల్లల చేత చప్పట్లు కొట్టిస్తున్నారని రాహుల్‌ అన్నారు. ఇదంతా పక్కా డ్రామాలా సాగిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడీఎస్‌ అధికార ప్రతినిధి డానిష్‌ అలీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, ఎన్సీపీ నేత తారీఖ్‌ అన్వర్, డీఎంకే నేత తిరుచ్చి శివ, టీఎంసీ నాయకుడు చన్‌ మిత్ర తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు