వారికే ఖజానా తాళాలు

11 Nov, 2018 04:36 IST|Sakshi
రాజ్‌నంద్‌గావ్‌లోని గురుద్వారకు వచ్చిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ

పారిశ్రామికవేత్తలకు ‘ఉపాధి’ వ్యయానికి 10 రెట్ల విలువైన రుణాలు మాఫీ

మోదీపై రాహుల్‌ ఆరోపణ

చరమా(ఛత్తీస్‌గఢ్‌): ‘నాలుగేళ్లలో ప్రధాని మోదీ తనకు సన్నిహితులైన 15 మంది బడా పారిశ్రామికవేత్తలకు రూ.3.5 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకు ఏడాదికి అయ్యే వ్యయానికి ఈ మొత్తం సుమారు 10 రెట్లు. మోదీ ఆ 15 మందికే దేశ ఖజానా తాళాలు అప్పగించారు. కానీ కాంగ్రెస్‌.. రైతులు, యువత, పేదలు, మహిళలు, గిరిజనులకు ఆ తాళాలు ఇవ్వాలనుకుంటోంది’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ శనివారం ప్రధాని మోదీ, ఛత్తీస్‌ సీఎం రమణ్‌సింగ్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు. చిట్‌ఫండ్, పౌరసరఫరా కుంభకోణాల్లో రమణ్‌సింగ్‌కు పాత్ర ఉందని, పనామా పత్రాల్లో రమణ్‌సింగ్‌ కొడుకు అభిషేక్‌ సింగ్‌ పేరు ఉన్నా, ఆయనకు ఎలాంటి శిక్ష పడలేదని అన్నారు.

చేష్టలుడిగిన రమణ్‌సింగ్‌..
చరామాలో జరిగిన ర్యాలీలోనూ రాహుల్‌ మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌ చిట్‌ఫండ్‌ కుంభకోణంలో రూ.5 వేల కోట్లు అదృశ్యమయ్యాయని, సుమారు 60 మంది మరణించగా, 310 కేసులు నమోదయ్యాయని అన్నారు. అయినా ఎవరికీ శిక్షలు పడలేదని, ఈ వ్యవహారంలో చర్యలు తీసుకునేందుకు రమణ్‌సింగ్‌ వెనకడుగు వేశారని ధ్వజమెత్తారు. ఇక పౌర సరఫరా కుంభకోణంలో రూ.36 వేల కోట్లను దోచుకున్నారని, ఇందులో రమణ్‌సింగ్‌ పాత్రను తేటతెల్లంచేసే పత్రాలు లభ్యమయ్యాయని అన్నారు. రమణ్‌సింగ్‌ 15 ఏళ్ల పాలనలో 40 లక్షల మంది యువత నిరుద్యోగులుగానే మిగిలారని, 65 శాతం భూభాగానికి సాగునీరు లేదని, గిరిజనుల నుంచి 56 వేల ఎకరాల భూమిని లాక్కుని సీఎం స్నేహితులకు కట్టబెట్టారని ఆరోపించారు. స్థానికులు నిరు ద్యోగులుగా మిగలడానికి కారణమైన ఔట్‌సోర్సింగ్‌ విధానానికి స్వస్తి పలుకుతామన్నారు.  

స్నేహమే అర్హతా?..: ప్రధాని మోదీకి స్నేహితుడు అయినందుకే అనిల్‌ అంబానీ రఫేల్‌ ఒప్పందాన్ని దక్కించుకున్నారని రాహుల్‌ ఆరోపించారు. దేశానికి కాపలాదారుడిగా చెప్పుకునే మోదీ..తన స్నేహితుడికి లబ్ధిచేకూర్చడానికే యూపీఏలో కుదిరిన ఒప్పందంలో మార్పులు చేశారన్నారు. ఒక్కో విమానానికి రూ.526 కోట్ల చొప్పున మొత్తం 126 విమానాల్ని కొనడానికి యూపీఏ హయాంలో ఒప్పందం కుదిరితే, ఒక్కో విమానానికి రూ.1600 కోట్లు చెల్లించడానికి ఎన్డీయే అంగీకరించిందని ఆరోపించారు.

‘తొలి’ ప్రచారం సమాప్తం
రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గడువు శనివారం సాయంత్రం 3 గంటలకు ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 8 జిల్లాల్లోని 18 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 12వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ సహా మొత్తం 190 మంది అభ్యర్థులు మొదటి విడత ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యనే ఉండగా జనతా కాంగ్రెస్‌(జే), బీఎస్‌పీ, సీపీఐల కూటమి కూడా ఈసారి తలపడుతోంది. మొత్తం 31,79,520 మంది ఓటర్ల కోసం 4,336 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు.  ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రజలకు మావోలు పిలుపివ్వడంతో భద్రత ఏర్పాట్లు పెంచారు.కొండ ప్రాంతాల్లోని పోలింగ్‌ బూత్‌లకు సిబ్బందిని, సామగ్రిని చేరవేసేందుకు హెలికాప్టర్లను వినియోగి స్తున్నట్లు అధికారులు తెలిపారు.  మిగతా 72 నియోజకవర్గాలకు 20న రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

రాహుల్‌తో ప్రజలకు వినోదం
రాయ్‌పూర్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంతో ప్రజలకు వినోదం పంచారని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ ఎద్దేవా చేశారు. తమ రాష్ట్రం గురించి ఆయనకు ఏమీ తెలియదని దెప్పిపొడిచారు. ‘ఛత్తీస్‌గఢ్‌ గురించి రాహుల్‌కు ఏమీ తెలియదు. ఆయన విమర్శలను రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం లేదు. ప్రచార కార్యక్రమాలతో ప్రజలకు రాహుల్‌ కేవలం వినోదం పంచారు’ అని రమణ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో రాహుల్‌ ప్రచారం బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయలేకపోగా ఆయన సొంత పార్టీ కాంగ్రెస్‌కే హాని కలిగించేలా ఉన్నాయి’ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారీ మిత్రులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న రాహుల్‌ విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ఇలాంటివి కాంగ్రెస్‌ హయాం లో జరిగాయని తిప్పికొట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోల ప్రభావాన్ని దాదాపు లేకుండా చేశారంటూ సీఎంపై బీజేపీ చీఫ్‌ బీజేపీ అమిత్‌షా ప్రశంసల వర్షం కురిపించారు.

మరిన్ని వార్తలు