రాహుల్‌ గాంధీ నిరాహార దీక్ష

9 Apr, 2018 13:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు హయాంలో దేశంలో దళితులపై అకృత్యాలు పెరిగిపోయాయని, సామాజిక సామరస్యం దెబ్బతింటోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు. రాజ్‌భవన్‌లోని మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పించిన అనంతరం అక్కడే నిరాహార దీక్ష చేపట్టారు.

మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, శ్రేణులు తమ రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో నిరసన నిరాహార దీక్షలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాయి.

సీబీఎస్‌ఈ పరీక్షా పత్రాలు లీక్‌ కావడం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం, పార్లమెంటు సమావేశాలు పూర్తిగా స్తంభించిపోవడం, దళిత సంఘాలు ఈ నెల 2న నిర్వహించిన భారత్‌ బంద్‌లో హింస చోటుచేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో మోదీ సర్కారును, బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు రాహుల్‌ ఈ నిరసన దీక్షకు పూనుకున్నారు. నిరాహార దీక్షలో భాగంగా ఆయన మోదీ సర్కారు తీరుపై ధ్వజమెత్తే అవకాశముంది.

మరిన్ని వార్తలు