కాంగ్రెస్‌ను దెబ్బతీసింది ఆయనే..

15 May, 2018 17:02 IST|Sakshi
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ నైతిక ఓటమికి రాహుల్‌ గాంధీనే కారణమని బీజేపీ నేత సుబ్రమణియన్‌ స్వామి అన్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో  ఏఎన్‌ఐతో స్వామి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై ఆయన సెటైర్లు పేల్చారు. 

‘రాహుల్ అపరిపక్వ రాజకీయాలే కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీని దారుణంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఆయన వేసిన సవాళ్లు అసంబద్ధంగా, మూర్ఖంగా ఉన్నాయి. అసలు కాంగ్రెస్‌ పార్టీకి సరైన నాయకత్వం కూడా లేదు. రాహుల్‌ ఇంక లండన్‌ వెళ్లి స్థిరపడటం మంచిది. బీజేపీ వందకు పైగా సీట్లు సాధిస్తుందని నేను ముందు నుంచే చెబుతున్నా. లింగాయత్‌ అంశంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. బీజేపీ అవినీతి నిర్మూలన ఎజెండా కన్నడ ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. పట్టణాలతోపాటు గ్రామాల్లో కూడా ప్రజలు బీజేపీకి ఓట్లేశారు’ అని స్వామి తెలిపారు. 

ఇక ఈవీఎంల మూలంగానే బీజేపీ విజయం సాధించిందన్న కాంగ్రెస్‌ ఆరోపణలపై స్వామి నవ్వి ఊరుకున్నారు. మరోవైపు జేడీఎస్‌-కాంగ్రెస్‌ పొత్తు అంశంపై స్పందించని స్వామి, తన మిత్రుడైన యెడ్యూరప్ప ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు