రాహుల్‌ గాంధీని హెచ్చరించిన ఖర్గే..!

30 Aug, 2018 21:01 IST|Sakshi
రాహుల్‌ గాంధీ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ వచ్చే నెలలో ఢిల్లీలో నిర్వహించబోయే కార్యక్రమానికి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీని ఆహ్వానించనుందనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే రాహుల్‌ గాంధీని హెచ్చరించినట్టు సమాచారం. ఆరెస్సెస్‌ ఉచ్చులో పడొద్దనీ, అది పంపే ఆహ్వానాన్ని తిరస్కరించాలనీ, విషతుల్యమైన ఆరెస్సెస్‌ సభకు హాజరైతే ప్రమాదమని ఇటీవల జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో ఆయన రాహుల్‌ని హెచ్చరించినట్టు తెలుస్తోంది. కాగా, పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు సోనియాగాంధీ కూడా ఆరెస్సెస్‌ ఆహ్వానాన్ని తిరస్కరించారు.

అయితే ఇటీవల కొంతకాలంగా ఆరెస్సెస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీని కూడా ఈ కార్యక్రమానికి పిలవాలని ఆరెస్సెస్‌ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌ 17–19 వరకు మూడ్రోజుల పాటు ‘భవిష్యత్‌ భారత్‌: ఆరెస్సెస్‌ దృక్పథం’ పేరుతో ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఆరెస్సెస్‌ ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ వేదిక ద్వారా భారతదేశంలో ప్రస్తుతం చర్చకు వస్తున్న అంశాలపై సంఘ్‌ అభిప్రాయాలను ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ పంచుకుంటారు. దీంతోపాటుగా రాజకీయాలతోపాటు వివిధ రంగాల మేధావులతో విస్తృతమైన అంశాలపై చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు