టీ కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ కీలక భేటీ

3 Jan, 2019 15:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ‌:  తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మహాకూటమి పేరిట టీడీపీ, టీజేఎస్‌, సీపీఐలతో కలిసి వెళ్లినా.. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినా కాంగ్రెస్‌ పార్టీకి చేదు అనుభవమే మిగిలింది. ఈ నేపథ్యంలో రాహుల్‌తో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ కుంతియ తదితరులు భేటీ అయి చర్చించారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణలోని 33 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించాలని రాహుల్‌ గాంధీ ఆదేశాలు ఇచ్చారు.

రాహుల్‌తో భేటీ అనంతరం ఉత్తమ్‌, కుంతియా మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ 33 జిల్లాలకు వెనువెంటనే డీసీసీ అధ్యక్షుల నియమించాలని పీసీసీని రాహుల్ ఆదేశించారు. అదేవిధంగా మండల కమిటీలు, బ్లాక్ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. జనవరి 10వ తేదీలోగా సంస్థాగతంగా పార్టీ పదవులను భర్తీ చేయాలని రాహుల్ ఆదేశించారు. అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులే పంచాయతీ ఎన్నికలు, లోకసభ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించాలని అధిష్ఠానం ఆదేశించింది. టీ కాంగ్రెస్‌ను పూర్తి స్థాయిలో రానున్న ఎన్నికలకు సమాయత్తం చేయాలని రాహుల్ ఆదేశించారు. ప్రస్తుత ప్రదేశ్ ఎన్నికల కమిటీ సైజు ను తగ్గించి, కొత్తగా 15 మందితో  ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నాం’అని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు