రాహుల్‌ రాజీనామా: తొలిసారి కాంగ్రెస్‌ స్పందన

27 May, 2019 15:50 IST|Sakshi

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవం నేపథ్యంలో ఇందుకు బాధ్యతగా తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని రాహుల్‌గాంధీ పట్టుబడుతున్నట్టు వస్తున్న కథనాలపై కాంగ్రెస్‌ పార్టీ తొలిసారిగా స్పందించింది. అధ్యక్ష పదవి నుంచి రాహుల్‌ తప్పుకొనే అవకాశమే లేదని దాదాపుగా ధ్రువీకరించింది. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాల్‌ సోమవారం.. ఈ నెల 25న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంపై వదంతులు వ్యాప్తి చేయవద్దని ప్రజలను, మీడియాను కోరారు. సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్‌ రాజీనామాకు సిద్ధపడ్డారని, అందుకు సీడబ్ల్యూసీ నిరాకరించిందని, అయినా రాహుల్‌ వెనుకకు తగ్గడం లేదని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.

సీడబ్ల్యూసీ సమావేశం ఆంతరంగిక భేటీ అని, ఆ సమావేశంపై పుకార్లు, వదంతులు సృష్టించడం తీవ్ర అవాంఛనీయమని ఆయన స్పష్టం చేశారు. ‘దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి సీడబ్ల్యూసీ ఒక ప్రజాస్వామిక వేదిక. ఆంతరంగికంగా జరిగే ఈ భేటీ పవిత్రతను కాపాడాలి. ఈ విషయమై ఒక వర్గం మీడియాలో వస్తున్న వదంతులు, పుకార్లు, కథనాలు అవాంఛనీయం’ అని సుర్జేవాల ట్వీట్‌ చేశారు. తద్వారా రాహుల్‌ రాజీనామా ఉండబోదని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

మరిన్ని వార్తలు