కాంగ్రెస్‌ అధ్యక్షుడు.. ఆ రికార్డు రాహుల్‌ది కానేకాదు

16 Dec, 2017 12:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రాహుల్‌ గాంధీ పేరిట ఓ రికార్డు నమోదయ్యిందన్న వార్తపై ఎట్టకేలకు స్పష్టత లభించింది. 47 ఏళ్ల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ చిన్న వయసులో అధ్యక్షుడు అయ్యాడంటూ కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. 

అయితే కాంగ్రెస్‌ పార్టీ రికార్డులను పరిశీలిస్తే.. ఆ రికార్డు  మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్‌ పేరిట ఉంది. 35 ఏళ్లకే ఆజాద్‌ అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1923లో కాకినాడలో నిర్వహించిన సమావేశంలో మహ్మద్‌ అలీ జవహార్ ను కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే అదే ఏడాది ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి తిరిగి ఆజాద్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అప్పటికీ ఆయన వయసు 35 ఏళ్లు మాత్రమే. ఆ విషయం రికార్డుల్లో స్పష్టంగా ఉంది. 

ఇక రాహుల్ కుటుంబంలో కూడా ఆ ఘనత సాధించింది కూడా ఆయన కానేకాదు. 1929 లాహోర్‌ సమావేశంలో జవహార్‌లాల్‌ నెహ్రూను అధ్యక్షుడిగా ఎన్నుకోగా.. అప్పటికీ ఆయన వయసు 40 ఏళ్లు. పోనీ స్వాతంత్ర్యం తర్వాత రికార్డు చూసుకున్నా 41 ఏళ్లకే రాజీవ్‌ గాంధీ (1985లో) ఆ బాధ్యతలు స్వీకరించారు. ఆ లెక్కన్న కాంగ్రెస్‌ యువ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా రికార్డు మాత్రం రాహుల్‌ గాంధీకి దక్కకుండా పోయింది.

మరిన్ని వార్తలు