11న రాహుల్‌ పట్టాభిషేక ప్రకటన

7 Dec, 2017 02:30 IST|Sakshi

కొత్త పీసీసీలపై కసరత్తు

ప్లీనరీపై సీడబ్ల్యూసీలో నిర్ణయం

యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీని ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది.  ఏఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ఉపసంహరణ గడువు 10వ తేదీతో ముగియనుంది. రాహుల్‌ నామినేషన్‌ ఒక్కటే దాఖలు కావడంతో ఆయన ఏకగ్రీవంగా  ఎన్నికైనట్లు 11వ తేదీన ప్రకటించనున్నారు. దీంతోపాటు గుజరాత్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కొత్త అధ్యక్షుడి నేతృత్వంలో జరుగుతుంది. ఈ సమావేశంలోనే ఏఐసీసీ ప్లీనరీ తేదీని నిర్ణయిస్తారు.

ప్లీనరీకి నెల ముందుగానే నోటీసులు జారీ చేస్తారు. ప్లీనరీలో రాహుల్‌ ఎన్నికను లాంఛనంగా ప్రకటిస్తారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీకీ ఎన్నికలు జరుపుతారు. ఈ కమిటీలో ఉండే 20 మందిలో పది మందిని నామినేట్‌ చేస్తారు. మిగతా వారిని ఏఐసీసీ ప్రతినిధులు ఎన్నుకుంటారు. పార్టీలో నూతనోత్సాహం నింపేందుకు కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే రాహుల్‌ సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. సంక్రాంతి తర్వాత.. రాష్ట్రాల స్థాయిలో పీసీసీలు, డీసీసీలను పునర్‌వ్యవస్థీకరిస్తారని తెలుస్తోంది.

చాలా రాష్ట్రాల పీసీసీలు అంతర్గత కలహాలతో నిస్తేజంగా, నామమాత్రంగా మారాయని, 2014 ఎన్నికల తర్వాత ఏఐసీసీ కూడా సంస్థాగతంగా బలహీనపడిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఫిర్యాదులతో తనను కలిసిన కొందరు నేతలతో రాహుల్‌.. సోనియా మేడమ్‌ వద్దకు వెళ్లండని చెబుతుండగా.. సోనియా వద్దకు వెళ్లిన వారికి కూడా రాహుల్‌ను కలవండనే సమాధానం ఎదురైంది. దీంతో ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో చాలా పీసీసీలు ఉన్నాయి.
ఇన్నాళ్లూ.. ఇలాగే కాలం గడిచినా ఇకపై పరిస్థితి మారుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సమస్యలను ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించటంతోపాటు, అందరినీ కలుపుకుని పోగల నేత రాహుల్‌ అని అంటున్నారు. సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవటంతో రాష్ట్ర విభాగాలకు మరింత స్వేచ్ఛ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

ఇదే సమయంలో సీనియర్‌ నేతలకు సముచితస్థానం కల్పిస్తారని భావిస్తున్నారు. యువ నేతలకు ప్రోత్సాహం, సీనియర్లకు సముచిత స్థానం కల్పిస్తూ రాహుల్‌ పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకెళ్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏఐసీసీ నుంచి వైదొలుగుతున్న సోనియా గాంధీ ఇకపై యూపీఏ సారథ్య బాధ్యతలను చేపడతారని భావిస్తున్నారు. భాగస్వామ్య పక్షాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ, కూటమిని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

మరిన్ని వార్తలు