ఈసారి వస్తా.. 

15 Aug, 2018 04:11 IST|Sakshi
తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తోన్న ఏఐసీసీ అ«ధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. చిత్రంలో కాంగ్రెస్‌ నేతలు

     మీరు అధికారికంగా అనుమతి తీసుకోండి

     ఓయూ విద్యార్థి నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఈసారి రాష్ట్రానికి వచ్చినప్పుడు తాను ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తానని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. తన రాక కోసం అధికారికంగా అనుమతి తీసుకోవాలని ఆయన విద్యార్థి నేతలకు సూచించారు. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ కోటూరి మానవతారాయ్‌ నేతృత్వంలోని 15 మంది ఓయూ విద్యార్థి నేతల బృందం మంగళవారం రాహుల్‌ని కలిసింది. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగుల పరిస్థితిని వివరించారు. టీఎస్‌పీఎస్సీలో అధికారికంగా రిజిస్టర్‌ చేసుకున్న నిరుద్యోగులే రాష్ట్రంలో 14 లక్షల మందికి పైగా ఉన్నారని, కేసీఆర్‌ ప్రభుత్వ తీరుతో వారంతా నైరాశ్యంతో ఉన్నారని తెలిపారు. జూనియర్‌ లెక్చరర్లు, డిగ్రీ కళాశాల లెక్చరర్ల నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చిన ఒక్క గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ కూడా కోర్టులో ఆగిపోయిందని, ఏ నోటిఫికేషన్‌ ఇచ్చినా తప్పుల తడకగా ఇస్తున్నారని, వాటిని కోర్టులు నిలిపివేస్తున్నాయని చెప్పారు. దీని వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారని రాహుల్‌కు వివరించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పగా, రాహుల్‌ స్పందిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల కష్టాలు తీరతాయని, ఎవరూ బాధపడవద్దని హామీ ఇచ్చారు. ఓయూ విద్యార్థి నేతలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన 10 మంది విద్యార్థి నేతలకు టీఆర్‌ఎస్‌ అవకాశం కల్పించిందని, అటు పార్టీ పదవుల్లోనూ, ఇటు అసెంబ్లీ, లోక్‌సభ టికెట్ల కేటాయింపులోనూ ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తు చేశారు. దీంతో ఓయూ విద్యార్థి నేతలకు పార్టీ ఆఫీస్‌ బేరర్ల నియామకంలోనూ, టికెట్ల కేటాయింపులోనూ ఉన్న అవకాశాలను పరిశీలించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాహుల్‌ సూచించారు. రాహుల్‌ను కలిసిన వారిలో విద్యార్థి నేతలు చరణ్‌కౌశిక్, దరువు ఎల్లయ్య, దుర్గం భాస్కర్, బాలలక్ష్మి, అర్జున్‌బాబు, శ్రీధర్‌గౌడ్, చెనగాని దయాకర్, బొమ్మా హనుమంతరావు, పుప్పాల మల్లేశ్, పున్నా కైలాశ్‌ నేత, విజయ్‌కుమార్, కేతూరి వెంకటేశ్, లోకేశ్‌యాదవ్, మదన్‌ ఉన్నారు.  
 
బీసీ బిల్లు పెడితే మద్దతిస్తాం 
బీసీ సంక్షేమ సంఘం నేతలకు రాహుల్‌ హామీ  
సాక్షి, హైదరాబాద్‌: బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెడితే కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్యకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. మంగళవారం హరిత ప్లాజాలో ఆర్‌.కృష్ణయ్య రాహుల్‌గాంధీని కలిసి బీసీల సమస్యలపై వివరించారు. పేరుకే ప్రజాస్వామ్యమని, ఏ రంగంలోనూ బీసీలకు న్యాయం జరగడంలేదని కృష్ణయ్య వాపోయారు. ఉద్యోగ రంగంలో 9శాతం, రాజకీయరంగంలో 14 శాతం, పారిశ్రామిక, కాంట్రాక్టు రంగంలో ఒక శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్నారు. 56 శాతం జనాభా ఉన్న బీసీలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉంటే ప్రజాస్వామ్యం అవుతుందా అని రాహుల్‌గాంధీని కృష్ణయ్య ప్రశ్నించారు. ఈ పార్లమెంట్‌లో బిల్లు పెట్టకపోతే మేం అధికారంలోకి రాగానే బీసీ బిల్లు, రాజకీయ రిజర్వేషన్ల బిల్లు పెడతామని రాహుల్‌ హామీ ఇచ్చారని కృష్ణయ్య పేర్కొన్నారు. 

రాహుల్‌ బస్సులోనే... 
హరితప్లాజాలో కలిసి తిరిగివెళ్తున్న కృష్ణయ్యను తన బస్సులోకి రావాలని రాహుల్‌ చేయిపట్టి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీకి బీసీ సమస్యలపై కృష్ణయ్య వివరించారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ సీట్లలో 50 శాతం, పంచాయతీరాజ్‌లో 34 శాతం నుంచి 52 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని తెలిపారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి, బీసీ అభివృద్ధికి ప్రత్యేక స్కీంను రూపొందించాలన్నారు. అదేవిధంగా బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ ఎత్తేయాలని, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ మాదిరిగా బీసీ యాక్టును తీసుకురావాలని కోరారు. కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 27శాతం నుంచి 56 శాతానికి పెంచాలని, కేంద్ర స్థాయిలో రూ.60వేల కోట్ల బడెŠజ్‌ట్‌తో బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. బీసీలకు పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీం విధానం సాచురేషన్‌ పద్ధతిలో ప్రవేశపెట్టాలన్నారు. 

మరిన్ని వార్తలు