రాహుల్‌కే కీలకం!

11 Dec, 2018 04:13 IST|Sakshi

కాంగ్రెస్‌పై 5 రాష్ట్రాల ఫలితాల ప్రభావం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ తొలగిపోయే సమయం వచ్చేసింది. అయితే, తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఫలితాలు ప్రధాని మోదీ కంటే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌కే అత్యంత కీలకమనే భావన అంతటా వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలంటే కనీసం మూడు రాష్ట్రాల్లోనైనా నెగ్గాల్సి ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

మోదీకి వచ్చేదీ లేదు.. పోయేదీ లేదు..
2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతను మోదీనే తీసుకున్నారు. కానీ, ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఇందుకు భిన్నం. తెలంగాణ, మిజోరంలలో బీజేపీకి పట్టులేదు. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీకి బలమైన ముఖ్యమంత్రులున్నారు. శివరాజ్‌సింగ్‌ చౌహాన్, రమణ్‌ సింగ్‌ల పాలనా సామర్థ్యానికే ఈ ఎన్నికలు గీటురాయిగా మారాయి తప్ప మోదీ చరిష్మా ఎన్నికల్లో ఎక్కడా ప్రధాన అంశం కాలేదు. ఇక, రాజస్తాన్‌లో బీజేపీని ముంచినా తేల్చి నా దానికి ముఖ్యమంత్రి వసుంధరా రాజేదే బాధ్యత. పైగా, అయిదేళ్లకోసారి అధికార పగ్గాలు చేతులు మారడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు మోదీ ఇమేజ్‌పై ఏమంత ప్రభావం చూపించవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.   

ఆ రెండు అంశాలే ప్రధానం
అగస్టా కుంభకోణం వర్సెస్‌ రఫేల్‌ ఒప్పందం ప్రధానాంశాలుగా ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోట్ల రద్దు, నిరుద్యోగం, వ్యవసాయ రంగ సంక్షోభం, ఆర్థిక రంగం, అమలు కాని హామీలు, పెట్రో ధరలు కూడా ప్రభావం చూపించనున్నాయి. అందుకే, అయిదు రాష్ట్రాల ఫలితాలతో సంబంధం లేకుండా బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టింది. ప్రస్తుత లోక్‌సభలో బీజేపీకి ఉన్న స్థానాల్లో 75 శాతం కేవలం ఎనిమిది రాష్ట్రాల నుంచే వచ్చాయి. ఈసారి అంతగా ఆ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశం లేదు. అందుకే, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. మిగతా రాష్ట్రాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలన్న పట్టుదలతో మోదీ–షా ద్వయం ఉన్నట్టు తెలుస్తోంది.  

గెలిస్తే ప్రాంతీయ పార్టీలకు నమ్మకం
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పగ్గాలు గత ఏడాదే తీసుకున్న రాహుల్‌గాంధీ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఓడినా రాహుల్‌ గెలిచారన్న పేరు తెచ్చుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కకుండా తెరవెనుక వ్యూహాలను పకడ్బందీగానే రచించారు. ఇప్పుడు అయిదు రాష్ట్రాల్లో మెజార్టీ రాష్ట్రాలను కైవసం చేసుకుంటే రాహుల్‌ సమర్థుడనే పేరు వస్తుంది. ప్రాంతీయ పార్టీలకు కూడా రాహుల్‌ నాయకత్వంపై నమ్మకం కుదిరి బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. కాంగ్రెస్‌ ఓటమిపాలైతే రాహుల్‌ది ఐరన్‌ లెగ్‌ అన్న ముద్ర అలాగే ఉండిపోతుంది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కష్టంగా మారుతుంది.

మరిన్ని వార్తలు