పేదలకు కనీస ఆదాయ భద్రత

29 Jan, 2019 04:19 IST|Sakshi
రాయ్‌పూర్‌ సభలో రాహుల్, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బగేల్‌

త్వరలో దేశవ్యాప్త పథకం ప్రకటిస్తాం

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వెల్లడి

గోవా ఆడియో టేపులు నిజమైనవేనని పునరుద్ఘాటన

న్యూఢిల్లీ/పణజీ/రాయ్‌పూర్‌: లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని పేదలందరికీ కనీస ఆదాయ భద్రత కల్పించి పేదరికాన్ని రూపుమాపుతామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ప్రకటించారు. దీంతో ‘పేదరికాన్ని తొలగించండి’(గరీబీ హఠావో) అంటూ  1971 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఇచ్చిన నినాదాన్ని మళ్లీ రాహుల్‌ అందుకున్నట్లైంది. ప్రధాని మోదీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి సరిగ్గా 4రోజుల ముందు కాంగ్రెస్‌ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో రైతుల ర్యాలీలో సోమవారం  రాహుల్‌ మాట్లాడారు. ‘చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ప్రజలందరికీ కనీస ఆదాయ భద్రతను కాంగ్రెస్‌ కల్పించబోతోంది. దీంతో దేశంలో ఆకలి, పేదరికం అనేదే ఉండదు’ అని రాహుల్‌ అన్నారు. చెప్పింది చేస్తానని, పథకాన్ని దేశమంతటా అమలు చేస్తానన్నారు. ర్యాలీలో బీజేపీపై రాహుల్‌ పలు విమర్శలు చేశారు. 15 మంది బడా పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.3.5కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసిందనీ, రైతులకు రుణమాఫీ చేయలేదని అన్నారు.

మోదీ ప్రభుత్వం రెండు భారత దేశాలను సృష్టించాలని ప్రయత్నిస్తోందనీ, వాటిలో ఒకటి రఫేల్‌ కుంభకోణం, అనీల్‌ అంబానీ, నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా, మెహుల్‌ చోక్సీ తదితరులు ఉండే దేశం కాగా, ఇంకొకటి పేద రైతులు ఉండే దేశమని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు ఓటేసి భారీ మెజారిటీతో అధికారం కట్టబెట్టిన రైతులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ ర్యాలీని కాంగ్రెస్‌ ఏర్పాటు చేసింది. కనీస ఆదాయ భద్రత హామీపై బీజేపీ స్పందించింది. ఇప్పటికే కాంగ్రెస్‌ ఇచ్చిన వందలకొద్దీ అబద్ధపు హామీల్లో ఇదొకటనీ, వాటిని అమలు చేయడం ఆ పార్టీకి కుదరని పని అని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు.

ఆ టేపులు నిజమైనవే
రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన వ్యాఖ్య లున్న గోవా ఆడియో టేపులు నిజమైనవేనని రాహుల్‌ ఆరోపించారు. గోవా ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ రక్షణ మంత్రి మనోహరీ పరీకర్‌ వద్ద రఫేల్‌ ఒప్పందం గురించిన భారీ రహస్యాలు ఉన్నాయనీ, వాటి వల్లనే ప్రధాని నరేంద్ర మోదీపై అధికారం చెలాయించే అవకాశం పరీకర్‌కు దక్కిందని రాహుల్‌ అన్నారు. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన రహస్య పత్రాలు పరీకర్‌ వద్ద ఉన్నాయి కాబట్టే ఆయన పదవిలో ఉన్నాడంటూ గోవా మంత్రి విశ్వజిత్‌ రాణే ఒక గుర్తు తెలియని వ్యక్తికి చెబుతున్న ఆడియో టేపులు ఈ నెల మొదట్లో బయటపడటం తెలిసిందే. రాహుల్‌ మాట్లాడుతూ ‘30 రోజులవుతున్నా వీటిపై విచారణేదీ లేదు. ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు కాలేదు.

మంత్రిపై ఏ చర్యలూ లేవు. ఈ ఆడియోటేపులు నిజమైనవేనని తెలుస్తోంది. రఫేల్‌ రహస్య పత్రాలు పరీకర్‌ దగ్గర ఉన్నాయి’ అని అన్నారు. రఫేల్‌ డీల్‌కు చెందిన ఆధారాలు తన పడకగదిలో ఉన్నాయంటూ పరీకర్‌ వ్యాఖ్యానించినట్లుగా గతంలో వచ్చిన వార్తలపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటలయుద్ధం జరిగింది. ఆ ఆడియో టేపులు నకిలీవనీ, నిజాలను దాచి అబద్ధాలను వ్యాప్తి చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని పరీకర్‌ అప్పట్లో చెప్పారు. బీజేపీ నేత అనంతకుమార్‌ హెగ్డే కేంద్ర మంత్రి పదవిలో ఉండేందుకు అనర్హుడనీ, ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని రాహుల్‌ అన్నారు. అంతకుముందు కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావ్‌ భార్యను ఉద్దేశించి హెగ్డే అనుచిత వ్యాఖ్యలు చేశారు.

గోవాలో రాహుల్, సోనియా
రాహుల్‌ తన తల్లి, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాతో కలిసి శని, ఆదివారాల్లో గోవాలో వ్యక్తిగతంగా పర్యటించారు. పార్టీ నేతలతో సమావేశాలు అక్కడ ఏర్పాటు చేయలేదు. ఆదివారం వారు ఓ బీచ్‌ రెస్టారెంట్‌కు వెళ్లారు. కాగా, గోవాలో మండోవి నదిపై తమ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 5.1 కిలో మీటర్ల పొడవైన తాళ్ల వంతెనను రాహుల్‌ సందర్శించి, దేశాన్ని బీజేపీ ఎలా మారుస్తుందో చూడాలని  రాహుల్‌ను ట్విట్టర్‌లో బీజేపీ కోరింది. మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరు మీదుగా ఈ వంతెనకు అటల్‌ సేతు అని పేరు పెట్టారు.  
 

మరిన్ని వార్తలు