ఆర్‌ఎస్‌ఎస్‌ చెడ్డీగ్యాంగ్‌ అవమానకరం: రాహుల్‌

28 Dec, 2019 17:23 IST|Sakshi

గువాహటి : దేశ విభజనే ప్రధాన ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. యువత, ప్రజల సమస్యలు పట్టని మోదీ.. మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని మరోసారి విభజించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శనివారం అస్సాంలో పర్యటించిన రాహుల్‌.. అక్కడి కాంగ్రెస్‌ శ్రేణులు ఏ‍ర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గతంలో ప్రపంచ దేశాల్లో భారత్‌కు మంచి గుర్తింపు ఉండేదని.. నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి అనాలోచిత నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. నిరుద్యోగంతో యువత అల్లాడుతున్నారని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు.

అధికారంలోకి వచ్చాక కొంతమంది వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. ఈశాన్య ప్రాంతమైన అస్సాంపై ఆర్‌ఎస్‌ఎస్‌  పెత్తనం కొనసాగించాలని ప్రత్నిస్తోందని, నాగపూర్‌ పాలన ఇక్కడ సాగదని రాహుల్‌ హెచ్చరించారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న చెడ్డీగ్యాంగ్‌ ఆగడాలు ఇక్కడి ప్రజలు తిప్పికొడతారని రాహుల్‌ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ధరించే చెడ్డీలు ఖాకీ రంగుకు అవమానకరమని వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు