మూడు దశాబ్దాల తరువాత రాహుల్‌ సభ

3 Feb, 2019 16:00 IST|Sakshi

పట్నా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ రైతులకు మాత్రం రోజుకి కేవలం 17 రూపాయలు చెల్లిస్తోందని కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో  గొప్పలు చెప్పకోవడం కోసమే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, దాని ద్వారా రైతాంగానికి ఒరిగేదేమీ లేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ బిహార్‌లో పర్యటించారు. పట్నాలోని గాంధీ మైదానంలో జన్‌ ఆక్రోశ్‌ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. దాదాపు మూడు దశాబ్దాల తరువాత పట్నాలో కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభను నిర్వహించింది.

ర్యాలీలో రాహుల్‌ మాట్లాడుతూ.. బిహార్‌ అభివృద్ధిలో వెనుకబడి పోవడానికి నితీష్‌, మోదీనే కారణమని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో రైతులకు రుణమాఫీ చేసినట్లు రాహుల్‌ వెల్లడించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ దారుణంగా మారిపోయిందని, నిరుద్యోగుల సమస్య పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్నా సెంట్రల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు