బహిరంగ సభలో కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రాహుల్

14 Aug, 2018 17:50 IST|Sakshi

సాక్షి, హైదాబాద్‌ : ఏ కలల కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేశారో ఆ కలలు నెరవేరడం లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. తెలంగాణ సాధనలో ఆత్మబలిదానాలు చేసిన అమరులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో మంగళవారం జరిగిన ‘విద్యార్థి-నిరుద్యోగ గర్జన’సభలో టీఆర్‌ఎస్‌, ఎన్డీయే ప్రభుత్వాలపై ఆయన ధ్వజమెత్తారు. మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఆశపడ్డాం, కానీ కొత్తగా వచ్చిన సీఎం నిరుద్యోగులకు, విద్యార్థులకు ఒరగబెట్టిందేం లేదని అన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే..

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి టెండర్లు పారదర్శకంగా లేవని విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో పూర్తిగా కేసీఆర్‌ కుటుంబం ఆధిపత్యమే ఉందని అన్నారు. నరేంద్ర మోదీ, కేసీఆర్‌లు రీడిజైన్‌లో స్పెషలిస్టులని ఎద్దేవా చేశారు. మోదీ నోట్ల రద్దు చేస్తే.. కేసీఆర్‌ దానికి వంతపాడారని అన్నారు. ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద మోదీ, హైదరాబాద్‌లో ధర్నా చౌక్‌లో కేసీఆర్‌ నిరసనలు చేపట్టనీయకుండా నియంతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాగా, రాహుల్‌ తెలుగులో ప్రసంగం మొదలు పెట్టడంతో జనం నుంచి విశేష స్పందన లభించింది.

నరేంద్రమోదీ బేటీ బచావో.. బేటీ పడావో అనే నినాదమిచ్చారు. కానీ,  బిహార్‌లో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దేశంలోని మహిళలపై ఇంతటి అమానుష ఘటనలు జరుగుతున్నా మోదీ మౌనం వీడడం లేదని రాహుల్‌ అన్నారు. మోదీ తన నినాదంలో ఆడపిల్ల ఎవరి నుంచి రక్షించబడాలో చెప్పలేదన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల నుంచి ఆడపిల్లలను రక్షించాలా అని మోదీని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు