పూల్వామా ఉగ్రదాడితో లాభపడింది ఎవరు?

14 Feb, 2020 10:59 IST|Sakshi

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడితో లాభపడింది ఎవరని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటితో సరిగా ఏడాది పూర్తయిన సందర్భంగా రాహుల్‌ ట్విటర్‌ వేదికగా.. ఆ దాడిలో  మరణించిన 40 మంది అమర జవాన్లకు నివాళులర్పించారు. అలాగే బీజేపీ ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధించారు.‘పుల్వామా ఉగ్రదాడితో ఎక్కువగా లాభపడింది ఎవరు?. ఈ ఘటనపై జరిపిన విచారణలో ఏం తేలింది?. భద్రతా లోపాల వల్ల జరిగిన ఈ దాడికి బీజేపీ ప్రభుత్వంలోని ఎవరు బాధ్యత వహిస్తారు?’ అని రాహుల్‌ గాంధీ ట్విటర్లో పేర్కొన్నారు.

పుల్వామా ఉగ్రదాడిని బీజేపీ రాజకీయ లబ్ధికి వాడుకుందని కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తున్న సంగతి విదితమే. ఈ దాడిని సాకుగా చూపి భద్రత, జాతీయవాదం పేరిట బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందిందని కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పించారు. కాగా, గతేడాది ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ వాహన శ్రేణిపై జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 80 కిలోల బరువున్న హై గ్రేడ్‌ ఆర్డీఎక్స్‌ పేలుడు పదార్థాలు వాడినట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు