రాహుల్‌ నోట.. మళ్లీ అదే మాట

26 Jun, 2019 13:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎవరెన్ని చెప్పినా తన నిర్ణయంపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగలేనని మరోసారి విస్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్‌ పార్టమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాహుల్‌ను బుచ్చగించేందుకు ఎంపీలు ప్రయత్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి బాధ్యత ఏ ఒక్కరిదో కాదని, అధ్యక్షుడిగా కొనసాగాలని రాహుల్‌కు శశిథరూర్‌, మనీష్‌ తివారి నచ్చజెప్పారు. పార్టీకి మీ అవసరం ఉందని, అధ్యక్షుడిగా కొనసాగాలని కోరారు. ఈ అంశంపై తాను ఇప్పటికే ఒక తుది నిర్ణయం తీసుకున్నానని, వెనక్కు తగ్గబోనని వారికి రాహుల్‌ స్పష్టం చేసినట్టు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రాహుల్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని గత వారం రోజులుగా ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హరియాణా, మహారాష్ట్ర నాయకులతో ఆయన చర్చలు జరపడంతో ఈరకమైన ఊహాగానాలు వచ్చాయి. గత నెలలో అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలు వెలువడిన తర్వాత జరిగిన మొదటి సీడబ్ల్యూసీ సమావేశంలోనే ఈ నిర్ణయం ప్రకటించారు. అప్పటి నుంచి ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. (చదవండి: ఇతరులూ కాంగ్రెస్‌ చీఫ్‌ కావొచ్చు)

>
మరిన్ని వార్తలు