ప్రజా సమస్యలకు ‘ఎఫ్‌’ గ్రేడ్‌

27 May, 2018 03:52 IST|Sakshi
అమృత్‌సర్‌లో మోదీ దిష్టిబొమ్మను తగలబెడుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

సొంత ప్రచారానికి ‘ఏ+’

మోదీ నాలుగేళ్ల పాలనకు రాహుల్‌ గ్రేడ్‌లు

మోదీ– షా ద్వయం ప్రమాదకరమని ప్రజలు గ్రహించారు: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: గత నాలుగేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గ్రేడ్‌లు కేటాయించారు. ఎన్డీఏ పాలనను ట్విట్టలో ఆయన ఎగతాళి చేస్తూ అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వానికి వ్యవసాయం, విదేశాంగ విధానం, ఉద్యోగ కల్పనలో ‘ఎఫ్‌ ’ గ్రేడ్, నినాదాల రూపకల్పన, సొంత ప్రచారంలో రాహుల్‌ ‘ఏ+’ గ్రేడ్‌ ఇచ్చారు. ‘ఇది ఎన్డీఏ సర్కారు నాలుగేళ్ల రిపోర్టు కార్డు. వ్యవసాయం ‘ఎఫ్‌’, విదేశాంగ విధానం ‘ఎఫ్‌’, పెట్రో ధరలు ‘ఎఫ్‌’, ఉద్యోగ కల్పన ‘ఎఫ్‌’, నినాదాల రూపకల్పన ‘ఏ+’, సొంత ప్రచారం ‘ఎ+’, యోగా ‘బీ–’ అని గ్రేడ్‌లు ఇచ్చారు. అనర్గళంగా మాట్లాడటంలో దిట్ట, వ్యక్తిత్వ సమస్యలతో బాధపడే వ్యక్తి, ఏకాగ్రత లేని మనస్తత్వం అని మోదీ అంటూ రిమార్క్స్‌ ఇచ్చారు.

మోదీ–షా ద్వయం ప్రమాదకరం
మోదీ– అమిత్‌ షా ద్వయం దేశానికి ప్రమాదకరమని ప్రజలు గ్రహించారని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై ‘భారత్‌ మోసపోయింది’ పేరిట బుక్‌లెట్‌ను విడుదల చేస్తూ.. ఈ నాలుగేళ్లు నమ్మకద్రోహం, మోసం, ప్రతీకారం, అసత్యాలతో కూడిన పాలన కొనసాగిందని అందులో పేర్కొంది. ఇంగ్లిష్, హిందీలో విడుదల చేసిన ఈ పుస్తకంలో ప్రధాని మోదీకి 40 ప్రశ్నల్ని సంధించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల పేరిట లఘు చిత్రాన్ని కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్‌ గెహ్లాట్, సూర్జేవాలాలు శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్డీఏ హాయంలో దేశంలో భయం, విద్వేషపూరిత వాతావరణం సృష్టించారని ఆరోపించారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయని రాజ్యసభలో విపక్ష నేత ఆజాద్‌ పేర్కొన్నారు.

సాధించిందేమీ లేదు: వామపక్షాలు
న్యూఢిల్లీ: అపజయాలు, అబద్ధాలు, ఒట్టి ప్రచారాలు తప్ప నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం సాధించినవి మరేమీ లేవని వామపక్షాలు విమర్శించాయి. దేశ సామాజిక వ్యవస్థలు, ప్రజల జీవనాధారాలపై గతంలో ఎన్నడూ లేనంతగా ఈ నాలుగేళ్లలో దాడులు జరిగాయనీ, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ప్రజలకు రక్షణ ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. సీపీఐ నేత డి.రాజా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వెళ్తోందనీ, ప్రజలు భయంతో, అభద్రతా భావంతో జీవిస్తుండగా వారి రాజ్యాంగ బద్ధమైన, ప్రజాస్వామ్య హక్కులు ప్రమాదంలో ఉన్నాయని అన్నారు. వ్యవసాయ రంగం, ఆర్థిక వ్యవస్థలను మోదీ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు.

మరిన్ని వార్తలు