ఇంకొకరిని చూసుకోండి

28 May, 2019 03:58 IST|Sakshi
నెహ్రూ వర్ధంతి సందర్భంగా శాంతివన్‌లో నివాళులర్పించేందుకు వస్తున్న రాహుల్, సోనియా

అధ్యక్ష బాధ్యతల స్వీకరణకు రాహుల్‌ తిరస్కరణ

పార్టీ కోసం పనిచేస్తానని వ్యాఖ్య

రాహుల్‌ రాజీనామాకు అంగీకరించిన సోనియా, ప్రియాంక

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికీ రాజీనామా చేసిన రాహుల్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. తాజాగా సోమవారం కాంగ్రెస్‌ అధిష్టానం ఇద్దరు దూతలు అహ్మద్‌పటేల్, కేసీ వేణుగోపాల్‌లను రాహుల్‌ వద్దకు పంపగా, ఆయన తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టంగా చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తాను మళ్లీ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోననీ, ఇందుకోసం మరొకరిని ఎంపిక చేసుకోవాలని రాహుల్‌ సూచించినట్లు సమాచారం.

కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకూ తాను తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తానని రాహుల్‌ చెప్పారు. తొలుత రాహుల్‌ రాజీనామాకు ఒప్పుకోని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, సోదరి ప్రియాంక ఆయన్ను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే రాహుల్‌ వెనక్కి తగ్గకపోవడంతో వీరిద్దరూ చివరకు ఆయన రాజీనామాకు అంగీకరించిట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభకు ఎన్నికైన కొత్త ఎంపీలను కలుసుకునేందుకు రాహుల్‌ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి నూతన సారథిగా ఎవరు వ్యవహరిస్తారన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పార్టీ కోసం పనిచేస్తా..
కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ తాను పార్టీ కోసం పనిచేస్తానని కాంగ్రెస్‌ దూతలకు రాహుల్‌ చెప్పినట్లు సమాచారం. రాహుల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా తప్పుకుంటే తాను తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీనియర్‌ నేత చిదంబరం వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్, ప్రియాంకలు సీనియర్‌ నేతలపై మండిపడినట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా స్పందించారు. ‘ఈ విషయంలో తప్పుడు కథనాలు, వదంతులకు దూరంగా ఉండాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆయన వివరణ ఇచ్చారు.

నెహ్రూకు నివాళులు..
భారత తొలిప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్, మాజీ ప్రధాని మన్మోహన్‌లు యమునా నదీతీరన ఉన్న శాంతివన్‌లో సోమవారం ఆయనకు నివాళులు అర్పించారు.

కర్ణాటక, రాజస్తాన్‌లో నీలినీడలు
పార్టీలో సంక్షోభం కొనసాగుతున్న వేళ కర్ణాటక, రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కొనసాగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌ తిరుగుబాటు నేతలు రమేశ్‌ జర్కిహోళీ, డా.సుధాకర్‌లు బీజేపీ సీనియర్‌ నేత ఎస్‌ఎం కృష్ణతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం బొటాబోటీ మెజారిటీతో కొనసాగుతున్న నేపథ్యంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి గల అవకాశాలపై చర్చించారు. మంత్రి పదవులు దక్కక గుర్రుగా ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలపై బీజేపీ దృష్టి సారించినట్లు సమాచారం. 

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం జూన్‌ 10 వరకే కొనసాగుతుందని కాంగ్రెస్‌ నేత కేఎన్‌ రాజన్న బాంబు పేల్చారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఈ ఘోర ఓటమికి రాష్ట్ర సీఎం అశోక్‌ గెహ్లోత్‌ నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవాలని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌ చీఫ్‌గా రాహుల్‌ తప్పుకున్న నేపథ్యంలో పార్టీలో కూడా రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సునీల్‌ జాఖర్, జార్ఖండ్‌ చీఫ్‌ అజయ్‌ కుమార్, అస్సాంలో పార్టీ అధ్యక్షుడు రిపున్‌ బోరా సహా పలువురు నేతలు తమ అధ్యక్ష పదవులకు రాజీనామాలు సమర్పించారు.

మరిన్ని వార్తలు