బీజేపీ మేనిఫెస్టోకు రాహుల్‌ రేటింగ్‌ 

4 May, 2018 17:47 IST|Sakshi
బీజేపీ మేనిఫెస్టోకు 1/5 రేటింగ్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ

సాక్షి,న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోకు కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ వన్‌ రేటింగ్‌ ఇచ్చారు. ఉచిత స్మార్ట్‌ఫోన్లు, మహిళల రక్షణకు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు అంటూ పలు పథకాలతో ఊదరగొడుతూ బీజేపీ మేనిఫెస్టో ఊహల్లో విహరించిందని అభివర్ణించారు. బలహీనమైన పునాదులపై ఊహాజనితంగా బీజేపీ కర్ణాటక మేనిఫెస్టోను మోదీ స్ఫూర్తితో రూపొందించారని రాహుల్‌ ఎద్దేవా చేశారు.

ఓటర్లకు బీజేపీ ఎన్నికల ప్రణాళిక కొత్తగా ప్రకటించిందేమీ లేదని దుయ్యబట్టారు. బీజేపీ మేనిఫెస్టోను చదివి మీ సమయం వృధా చేసుకోవద్దు. దీనికి తాను 1/5 రేటింగ్‌ ఇస్తానని, దీన్ని చదవకపోవడమే మేలని సూచించారు. కాగా, గత వారం కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. సిద్ధరామయ్య నేతృత్వంలోని పాలక కాంగ్రెస్‌ గతంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను చాలావరకూ నెరవేర్చిందని రాహుల్‌ పేర్కొన్నారు.

అయితే కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిపై బీజేపీ సైతం విమర్శలకు పదునుపెట్టింది. కాంగ్రెస్‌ హామీలు కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకేనని విమర్శించింది. ఇక మే 12న జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌, బీజేపీ హోరాహోరీ తలపడుతున్నాయి. కర్ణాటకలో గెలుపు ద్వారా దక్షిణాదిలో పాగా వేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా, అధికారం నిలుపుకునేందుకు కాంగ్రెస్‌ చెమటోడుస్తోంది. మే 15న కర్ణాటక ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు