‘అయ్యర్‌.. కావాలని అన్నవి కావు’

19 Aug, 2018 13:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌పై విధించిన సస్పెన్షన్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం వెనక్కి తీసుకుంది. గుజరాత్‌లో తొలివిడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘నీచ జాతికి చెందిన వ్యక్తి’ అంటూ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదమయ్యాయి. దీనిపై రాజకీయ దుమారం రేగటంతో అయ్యర్‌ క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం రద్దుచేసింది. షోకాజ్‌ నోటీసులూ జారీచేసింది. అయ్యర్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా తప్పుబట్టిన విషయం తెలిసిందే. అయ్యర్‌ వ్యాఖ్యల కారణంగా గుజరాత్‌ ఎన్నికల్లో పెనుప్రభావం చూపి కాంగ్రెస్‌ ఓటమికి కారణమయింది. అయితే తాజాగా అయ్యర్‌.. మోదీపై కావాలని చేసిన వ్యాఖ్యలు కావని నమ్మిన కాంగ్రెస్‌ క్రమశిక్షణా కమిటీ రాహుల్‌ ఆదేశాల మేరకు సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.

అసలేం జరిగింది..
గుజరాత్‌ ఎన్నికల సమయంలో ఢిల్లీలో అంబేడ్కర్‌ అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ.. రాజ్యాంగ నిర్మాత దేశానికి చేసిన సేవలను చెరిపేసేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని వ్యాఖ్యానించారు. దీనిపై మణిశంకర్‌ అయ్యర్‌ స్పందిస్తూ.. ‘మోదీ నీచమైన జాతికి చెందిన వ్యక్తి, ఆయనకు సభ్యత లేదు’ అంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు గుజరాత్‌ ఎన్నికల సమయంలో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ప్రధాని అదే స్థాయిలో స్పందించారు. ఈ వ్యాఖ్యలు గుజరాతీలకు జరిగిన అవమానమని, కాంగ్రెస్‌ నేతల మొఘల్‌ ఆలోచనకు ఇది ప్రతిరూపమని అన్నారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటేయటం ద్వారా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈ ప్రభావం గుజరాత్‌ ఎన్నికలపై తీవ్రంగా పడి కాంగ్రెస్‌ ఓటమికి దారి తీసిన విషయం తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు