ఓటమికి నాదే బాధ్యత

4 Jul, 2019 03:11 IST|Sakshi

అందుకే నిష్క్రమిస్తున్నా

నాలుగు పేజీల బహిరంగ లేఖలో రాహుల్‌ గాంధీ వెల్లడి

న్యూఢిల్లీ: ఎట్టకేలకు రాహుల్‌ గాంధీ తన పంతం నెగ్గించుకున్నారు. వర్కింగ్‌ కమిటీ వారించినా, పార్టీ శ్రేణులు వద్దని బతిమాలినా వినకుండా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి తనదే బాధ్యత అని అంగీకరించారు. పార్టీ అభివృద్ధికి జవాబుదారీతనం కీలకమని, అందుకోసమే తాను రాజీనామా చేస్తున్నానని 49 ఏళ్ల రాహుల్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. నాలుగు పేజీల ఆ లేఖను ట్విట్టర్‌లో పెట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 52 స్థానాలు మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడిన రెండు రోజులకు తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు రాహుల్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆయన రాజీనామాను తిరస్కరించింది. పార్టీ శ్రేణులు రాజీనామా చేయవద్దని కోరాయి.

రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాహుల్‌ గాంధీని కలిసి సంఘీభావం ప్రకటించారు. ఎన్నికల ఓటమికి తాము నైతిక బాధ్యత వహిస్తామని చెప్పారు. తాను రాజీనామా చేసినందున కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడం కోసం ఒక కమిటీని వేయాలని రాహుల్‌ ఆ లేఖలో పార్టీ వర్కింగ్‌ కమిటీని కోరారు. కాంగ్రెస్‌ పార్టీకి సేవచేయడం తనకు గౌరవప్రదమన్నారు. విలువలు, ఆదర్శాలే జీవనాడులుగా కాంగ్రెస్‌ పార్టీ ఈ దేశానికి సేవ చేసిందని భావోద్వేగపూరితంగా పేర్కొన్నారు. ఈ దేశానికి, పార్టీకి తాను ఎంతో కృతజ్ఞుడినన్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా, 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి నాదే బాధ్యత. మన పార్టీ భవిష్యత్తులో పైకి రావాలంటే జవాబుదారీతనం కీలకం. ఈ కారణంగానే నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేశా’అని రాహల్‌ తెలిపారు. పార్టీ పునర్నిర్మాణానికి కఠిన నిర్ణయాలు అవసరమన్నారు. ఎన్నికల ఓటమికి అనేక మందిని బాధ్యుల్ని చేయాల్సి వస్తుందని, అయితే, పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతను విస్మరించి ఇతరులను బాధ్యుల్ని చేయడం సరికాదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో తాను ప్రధాని మోదీతోనూ, ఆరెస్సెస్‌తోనూ, వారి గుప్పిట్లో ఉన్న సంస్థలతోనూ శక్తివంచన లేకుండా పోరాడానన్నారు. ‘భారత దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను. అందుకే వారితో పోరాడా. ఒక్కోసారి ఈ పోరాటంలో నేను పూర్తిగా ఒంటరివాడినయ్యా. అయినా పోరాడినందుకు గర్వపడుతున్నా’అని రాహుల్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ దేశాన్ని గుప్పిట్టో పెట్టుకోవాలన్న ఆరెస్సెస్‌ లక్ష్యం దీంతో పూర్తయిందన్నారు. బీజేపీ అధికారం కైవసం చేసుకోవడం వల్ల దేశంలో ఊహించని స్థాయిలో హింస చెలరేగుతుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు జాతి మొత్తం ఏకం కావాలని, దీనికి కాంగ్రెస్‌ ఆయుధం అవుతుందని రాహుల్‌ పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే లక్ష్యాన్ని సాధించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తనను తాను పూర్తిగా సంస్కరించుకోవాలి. ప్రస్తుతం బీజేపీ ఒక పద్ధతి ప్రకారం ప్రజల గొంతు నొక్కేస్తోంది. ప్రజావాణిని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే. భారత దేశమెప్పుడూ ఒకే గొంతు కాదు..కాబోదు. అది అనేక గొంతుల సమాహారం. అదెప్పటికీ అలాగే ఉండాలి. అదే భారత మాత అసలు స్వరూపం’ అని రాహుల్‌ భావోద్వేగంతో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల కోసం తాను పోరాడుతూనే ఉంటానని, తన సేవలు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటానని రాహల్‌ పార్టీ శ్రేణుల నుద్దేశించి అన్నారు. ‘నేను కాంగ్రెస్‌వాదిగా పుట్టాను. కాంగ్రెస్‌ పార్టీ నా ప్రాణం. అదెప్పటికీ నాతోనే ఉంటుంది’ అని ఉద్ఘాటించారు.   

ట్విట్టర్‌లో హోదా తొలగింపు 
రాహుల్‌ గాంధీ తన ట్విట్టర్‌ ప్రొఫైల్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్న పదాలను తొలగించారు. ప్రస్తుతం ఆయన ట్విటర్‌ ఖాతాలో ‘ఇది రాహుల్‌ గాంధీ అధికారిక ఖాతా/ఇండియన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు/ పార్లమెంటు సభ్యుడు’ అని మాత్రమే దర్శనమిస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా, 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి నాదే బాధ్యత. మన పార్టీ భవిష్యత్తులో పైకి రావాలంటే జవాబుదారీతనం కీలకం. ఈ కారణంగానే నేను రాజీనామా చేశా
ఎన్నికల్లో  మోదీతో, ఆరెస్సెస్‌తో, వారి గుప్పిట్లో ఉన్న సంస్థలతో పోరాడా. ఒక్కోసారి ఈ పోరాటంలో నేను పూర్తిగా ఒంటరివాడినయ్యా. అయినా పోరాడినందుకు గర్వపడుతున్నా

కొత్త అధ్యక్షుడిగా ఖర్గే లేదా షిండే! 
సుశీల్‌ కుమార్‌ షిండే (77) లేదా మల్లికార్జున ఖర్గే(76)ల్లో ఒకరు కొత్త అధ్యక్షుడయ్యే చాన్సుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన షిండే గతంలో ఓసారి కేంద్ర మంత్రిగా చేశారు. 2002లో కాంగ్రెస్‌ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీపడ్డారు. ఈ ఏడాదే మహారాష్ట్రలో ఎన్నికలు జరగనుండటం, ఆయనకు గాంధీల కుటుంబంతో సాన్నిహిత్యం ఉండటంతో షిండేను తదుపరి అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అటు ఖర్గే కూడా పార్టీలో సీనియర్‌ నాయకుడే. ఆయనా గాంధీల కుటుంబానికి సన్నిహితుడే. గత లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేతగా ఆయన పనిచేశారు. ఖర్గే ప్రతిపక్షంలో ఉండి మోదీని సమర్థవంతంగా ఎదుర్కోగలడనే అభిప్రాయం ఉంది. గతంలో ఆయన ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపై ఓ వారంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.  

ఆయనే మా నాయకుడు 
అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా రాహులే మా నేత అని రాజస్తాన్‌ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ అన్నారు. పార్టీ కోసం ఆయన ఎంత శ్రమించారో మాకు తెలుసు. అందుకే రాజీనామాను వెనక్కు తీసుకోమని కోరుతున్నాం’ అని ఆయన అన్నారు. ‘ కాంగ్రెస్‌ సిద్దాంతాలు నమ్మేవారికి ఆయనే నాయకుడు. రాహుల్‌ గాంధీ సరైన నిర్ణయం తీసుకున్నారు’ అని మరో నేత అజయ్‌ మాకెన్‌ అన్నారు.

ఇదో కొత్త నాటకం 
రాహల్‌ గాంధీ రాజీనామా మరో కొత్త నాటకమని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామాతో తమకే సంబంధం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలా కాకుండా తమ పార్టీలో సంస్థాగత వ్యవస్థ పటిష్టంగా ఉందని, సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వ నమోదు వంటివి ఉన్నాయని మరో మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు