కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ సూచన

23 Jul, 2018 12:26 IST|Sakshi

కార్యనిర్వహక పద్దతిని బీజేపీ నుంచి నేర్చుకోండి : రాహుల్‌ గాంధీ

సాక్షి, న్యూఢిల్లీ : ప్రజల నుంచి ఓట్లను ఎలా రాబట్టుకోవాలో బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) నుంచి నేర్చుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతలకు సూచించారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం తొలిసారి ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. సమావేశంలో రాహుల్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ఎప్పుడూ విరుచుకుపడే రాహుల్‌ ఈ సారి దానికి భిన్నంగా మాట్లాడారు. కార్యనిర్వహక పద్దతిని ఎలా అనుసరించాలో బీజేపీని చూసి నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. పదిహేడు నిమిషాల రాహుల్‌ ప్రసంగంలో కొన్ని ఉదహరణలు కూడా గుర్తుచేశారు.

మొదటి నుంచి దేశంలోని గిరిజన ఓటర్లు కాంగ్రెస్‌ పక్షాన నిలిచేవారని, బీజేపీ నేతలు గిరిజన గూడాల్లోకి వెళ్లి ప్రచారం చేయడంతో వారి ఓట్లను బీజేపీ సొంతం చేసుకోగలిగిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తరువాత పార్టీ కార్యకర్తలకు ప్రొత్సాహకాలు  అందిస్తున్నరని తెలిపారు. ఎన్నికల సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలా కష్టపడుతున్నారో కూడా వారి నుంచి నేర్చుకోవాలని రాహుల్‌ సూచించారు. రాహుల్‌ ప్రసంగాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన కాసేపటికే ఆశ్చర్య కరంగా తొలగించారు. ఈ సమావేశంలో 2019 కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్‌ గాంధీయే అని సోనియా గాంధీ ప్రకటించిన విషయం తెలిసింది. ఎన్నికల్లో పొత్తులపై అంతిమ నిర్ణయం కూడా రాహుల్‌ గాంధీనే తీసుకుంటారని సోనియా స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు