చైనాతో వివాదం: ​కామెంట్‌ చేయదలచుకోలేదు

26 May, 2020 15:16 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి భారత ప్రజలకు చెప్సాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. చైనా, నేపాల్‌ వంటి పొరుగు దేశాలతో తలెత్తిన వివాదంపై పారదర్శకత పాటించాలని హితవు పలికారు. అప్పుడే అందరికీ నిజాలు తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాహుల్‌ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శలు సంధించారు. (లాక్‌డౌన్‌ విఫలం: ప్లాన్‌ బి ఏంటి..!)

‘‘నిజం చెప్పాలంటే.. అక్కడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలపై వేర్వేరు కథలు వింటున్నాం. వాస్తవాలు తెలియకుండా మనమేమీ మాట్లడలేము. కాబట్టి సరిహద్దుల్లో అసలేం జరుగుతుందో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చైనా, నేపాల్‌ వివాదంలో పారదర్శకత పాటించాల్సిన ఆవశ్యకత ఉన్నా.. ఎక్కడా ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. ప్రస్తుతం తలెత్తిన చైనా వివాదంపై కామెంట్‌ చేయదలచుకోలేదు. ఈ విషయాలను ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నా’’అని రాహుల్‌ పేర్కొన్నారు. (భారత్‌–చైనా సరిహద్దుల్లో కలకలం)

కాగా గత కొన్ని రోజులుగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు వీలుగా ఇటీవలే అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతికత గల హెలికాప్టర్‌–డ్రోన్‌ను త్వరలోనే టిబెట్‌లో భారత్‌ సరిహద్దుల్లో మోహరించనుందని చైనా అధికార మీడియా కథనం ప్రచురించింది. సరిహద్దుల వద్ద భారత్‌ ఆక్రమణలను ధీటుగా ఎదుర్కొనేందుకు తమ సైన్యం పనిచేస్తోందంటూ అక్కసు వెళ్లగక్కింది. అదే విధంగా నేపాల్‌ సైతం లిపులేఖ్‌ను తమ దేశ అంతర్భాగంగా పేర్కొంటూ మ్యాపులు విడుదల చేయడంతో ఇరు దేశాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి గత కొన్ని రోజులుగా భారత్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.(భారత్‌పై నేపాల్‌ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు