అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి హోదా

12 Jan, 2019 04:17 IST|Sakshi

దుబాయ్‌ పర్యటనలో  రాహుల్‌  

దుబాయ్‌: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే అంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటిస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. రెండురోజుల పర్యటన నిమిత్తం దుబాయ్‌ వెళ్లిన ఆయన శుక్రవారం స్థానిక లేబర్‌ కాలనీలో భారతీయ కార్మికులనుద్దేశించి మాట్లాడారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే మేము చేసే మొదటి పని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడమేనని రాహుల్‌ అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం గతేడాది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులు జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేశారని, అయినా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని ఎంతమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ఇవ్వాల్సిన ముఖ్యమైన హామీని ప్రధాని మోదీ విస్మరించారని, ఏపీకి దక్కాల్సిన హామీల విషయంలో మనమంతా కేంద్రానికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. భారత కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ ప్రపంచంలో అత్యద్భుత నగరంగా దుబాయ్‌ నిలవడంలో వారి శ్రమ ఎంతో ఉందన్నారు. వారు ఇక్కడ పనిచేస్తూ భారతదేశాభివృద్ధికి దోహదపడుతున్నారని ప్రశంసించారు. దుబాయ్‌లోని అందమైన ఆకాశ హర్మ్యాలు, ఎయిర్‌పోర్టులు వారి రక్తం, స్వేదంతో నిర్మితమైనవేనని అన్నారు. భారతీయుల శ్రమశక్తి లేకుంటే ఈ అద్భుతాలు సాధ్యమయ్యేవి కాదన్నారు.

మరిన్ని వార్తలు