ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు: రాహుల్‌

18 Sep, 2018 16:04 IST|Sakshi

సాక్షి, కర్నూల్‌ : ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన బైరెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడారు. విభజన సమయంలో ప్రత్యేక హోదాపై ఆనాటి ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే మొదటగా ప్రత్యేక హోదా హామీని నెరవేరుస్తామని స్పష్టంచేశారు. జీఎస్టీని సమూలంగా మార్పు చేస్తామన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థంతా కొంతమంది చేతుల్లోనే ఉందని, చిన్న, సన్నకారు రైతులు, వ్యాపారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదన్నారు. బడా వ్యాపారులకు మాత్రం బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయన్నారు. 

ప్రధానిగారు నోరు విప్పండి..
దేశంలో వరుసగా చోటు చేసుకుంటున్న అత్యాచారాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించక పోవడం ఆమోదయోగ్యం కాదని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ‘దేశంలో మరో ఆడబిడ్డపై గ్యాంగ్‌రేప్‌ జరగడం సిగ్గు చేటు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నిశ్శబ్దం ఆమోదయోగ్యం కాదు. భారత మహిళలకు రక్షణ కల్పించలేనందుకు, రేపిస్ట్‌లను కఠినంగా శిక్షించకుండా వదిలేస్తున్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. హరియాణలో సీబీఎస్‌ఈ టాపర్‌, 19 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన సామూహిక లైంగిక దాడి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు