‘ఇక్కడ కేసీఆర్‌.. అక్కడ మోదీ’

20 Oct, 2018 17:52 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: అవినీతికి పాల్పడటంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ప్రధాని నరేంద్ర మోదీ పోటీపడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్న రాహుల్‌.. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రజా గర్జనలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కామారెడ్డి సభలోనూ ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ఆపద్దర్మ సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ప్రజలు కలలు సాకారమవ్వలేదని, వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి కాంగ్రెస్‌ కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. 

లక్ష​ ఉద్యోగాలు.. నిరుద్యోగ భృతి
తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్‌ల పేరు మార్చి, రీడిజైన్ల పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారని కేసీఆర్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. యావత్‌ దేశం నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్‌ మాత్రం మోదీ నిర్ణయానికి మద్దతు పలికారని గుర్తు చేశారు. (కేసీఆర్‌కు అంబేద్కర్‌ నచ్చలేదు: రాహుల్‌)

మరోసారి రాహుల్‌ నోట రాఫెల్‌
రాఫెల్‌ కుంభకోణంతో దేశానికి ఎంతో నష్టం వాటిల్లిందని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఏఎల్‌ నుంచి కాంట్రాక్ట్‌ లాక్కొని అనిల్‌ అంబానికి కట్టబెట్టారరి దుయ్యబట్టారు. నల్లధనాన్ని కట్టడి చేస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ఇరు ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. దేశంలో ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలేనని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పంటలకు సరైన మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. (‘రాహుల్.. హైదరాబాద్‌ నుంచి పోటీ చేయండి’)

మరిన్ని వార్తలు