‘కేటీఆర్‌ ఆదాయం నాలుగు వందల శాతం పెరిగింది’

29 Nov, 2018 16:37 IST|Sakshi

విశ్రాంతి కోసం కేసీఆర్‌ మూడు వందల కోట్లతో భవనాన్ని నిర్మించుకున్నారు

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం

పసుపుకు మద్దతు ధర పదివేలకు పెంచుతాం

ఆర్మూర్‌ బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ 

సాక్షి, నిజామాబాద్‌: ‘తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతే.. సీఎం కేసీఆర్‌ కుమారుడి ఆదాయం మాత్రం నాలుగు వందల శాతం పెరిగింది. తెలంగాణ వస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు భావించారు. ఏ ఉద్దేశం కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందో దానికనుగుణంగా అభివృద్ది చెందటంలేదు. మాయ ప్రసంగాలతో తెలంగాణ ప్రజలన్ని కేసీఆర్‌ మోసం చేశారు’ అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ప్రజా కూటమి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టీఆర్‌ఎస్‌ పాలనపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ది చెందుతుందని, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్ర మోదీలు ఇద్దరూ ఒక్కటేనని, వారూ మాటలతోనే మాయ చేస్తారని ఎద్దేవ చేశారు. రాహుల్‌ పూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే..    

పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం
‘నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌, ఆయన కూతురు రైతులను మోసం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పసుపు బోర్డు ఏర్పాటు చేసి తీరుతాం. ఈ జిల్లాలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. మోదీ ప్రవేశపెట్టిన గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌ వల్ల వారికి జీవనోపాధి కరువైంది. మేము అధికారంలోకి రాగానే జీఎస్టీపై సమీక్షించి బీడీ కార్మికులను ఆదుకుంటాం. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం గల్ఫ్‌కు వలస వెళ్లి ఇబ్బందుల పాలవుతున్నారు. గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేకంగా 500 కోట్లు బడ్జెట్‌ను కేటాయిస్తాం. రైతులు మద్దతు ధరలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మద్దతు ధరలు అడిగినందుకు రైతులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేస్తుంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీ రైతును ఆదుకుంటాం, రుణమాఫీ చేస్తాం, 17 పంటలకు మద్దతు ధర కల్పిస్తాం.  వరికి రెండు వేలు, పసుపు, మిర్చికి పదివేలు, పత్తికి ఏడు వేల మద్దతు ధర కల్పిస్తాం

టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌
తెలంగాణ ఆర్‌ఎస్సెస్‌గా టీఆర్‌ఎస్‌ పనిచేస్తోంది. పార్లమెంట్‌లో బీజేపీకి మద్దతుగా టీఆర్‌ఎస్‌ ఎన్నోసార్లు నిలిచిన విషయం తెలిసిందే. కేసీఆర్‌కు ఓటు వేస్తే మోదీకి వేసినట్టే. కేసీఆర్‌ ఓటమితో మోదీ పతనం ప్రారంభం కావాలి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పంటలకు నీళ్లు ఇవ్వలేదు. భూసేకరణ చట్టాన్ని నీరుగార్చి రైతులను మోసం చేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగినా పట్టించుకోలేదు. తెలంగాణలో రెండు లక్షల మందికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లులు కట్టిస్తానన్న కేసీఆర్‌ కనీసం ఐదు వందల ఇళ్లులు కూడా కట్టలేకపోయారు. కానీ తను విశ్రాంతి తీసుకోవడానికి మాత్రం మూడు వందల కోట్లతో ఖరీదైన భవనాన్ని కట్టుకున్నారు’అంటూ కేసీఆర్‌, మోదీలపై రాహుల్‌ నిప్పులు చెరిగారు. 

మరిన్ని వార్తలు