ఇది రెండో నోట్ల రద్దు..!

29 Dec, 2019 01:45 IST|Sakshi
గువాహటిలో జరిగిన భారీ ర్యాలీనుద్దేశించి ప్రసంగిస్తున్న రాహుల్‌

ఎన్పీఆర్, ఎన్నార్సీ అమలుతో దేశంలో తీవ్ర పరిస్థితులు

గువాహటిలో జరిగిన ర్యాలీలో రాహుల్‌ విసుర్లు

కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినం సందర్భంగా దేశవ్యాప్త ప్రదర్శనలు

న్యూఢిల్లీ/గువాహటి/లక్నో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌), ఎన్నార్సీలు రెండో విడత నోట్లరద్దు వంటివని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఇవి అమలైతే నోట్లరద్దును మించిన దారుణ పరిస్థితులను దేశం మరోసారి ఎదుర్కోనుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అస్సాం రాజధాని గువాహటిలో జరిగిన పార్టీ ర్యాలీలో, అంతకుముందు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా అస్సాంలో జరిగిన హింసాత్మక ఘటనలు మునుపటి పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయంటూ రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. లక్నోలో జరిగిన వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె.. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితోనే యావత్‌ దేశం మరోసారి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోందని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపక దినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాహుల్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్, సీనియర్‌ నేతలు ఏకే ఆంటోనీ, మోతీలాల్‌ ఓరా, ఆనంద్‌ శర్మ తదితరులు హాజరయ్యారు.

ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఇప్పటికే నిరసనలు సాగిస్తున్న పార్టీ, వ్యవస్థాపక దినం సందర్భంగా రాజ్యాంగాన్ని రక్షించండి–దేశాన్ని కాపాడండి(సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌– సేవ్‌ ఇండియా) అంటూ రాష్ట్ర రాజధానుల్లో ప్రదర్శనలు చేపట్టింది. భారత్‌కే తమ మొదటి ప్రాధాన్యమని 135వ వ్యవస్థాపక దినం సందర్భంగా కాంగ్రెస్‌ పేర్కొంది. ‘స్వాతంత్య్ర సాధనే లక్ష్యంగా అవతరించిన పార్టీ, దేశమే ప్రథమమనే ఆశయానికి కట్టుబడింది. 135 ఏళ్ల ఐక్యత, 135 ఏళ్ల న్యాయం, 135 ఏళ్ల సమానత్వం, 135 ఏళ్ల అహింస, 135 ఏళ్ల స్వాతంత్య్రం. నేడు మనం 135 ఏళ్ల భారత జాతీయ కాంగ్రెస్‌ ఉత్సవాలు జరుపుకుంటున్నాం’ అని శనివారం ట్విట్టర్‌లో పేర్కొంది.

అస్సాం సంస్కృతిని నాశనం చేయనివ్వం
అస్సాం సంస్కృతి, గుర్తింపులను నాశనం చేసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రయత్నాలను కొనసాగనివ్వబోమని రాహుల్‌ స్పష్టం చేశారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రంలో మరోసారి హింసాత్మక వాతావరణ నెలకొనే అవకాశం ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాల గుర్తింపును, భాషలను అణచివేయడం అంటే వారిని బీజేపీ ఇంకా గుర్తించలేదని అర్థమన్నారు. తీవ్ర పోరాటాలతో ఇక్కడి ప్రజలు సాధించుకున్న అస్సాం ఒప్పందాన్ని యథాతథంగా అమలు చేసి, ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. బీజేపీ ఉన్న ప్రతిచోటా ప్రజల మధ్య కలహాలు, హింస, విద్వేషం ఉంటాయన్నారు.

నోట్లరద్దు, జీఎస్టీ అమలుతో మోదీ ప్రభుత్వం భరతమాతపై దాడి చేసిందని విమర్శించారు. ‘ప్రతి పేద వ్యక్తీ భారతీయ పౌరుడా కాదా అని నిరూపించుకోవడమే ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ల ఉద్దేశం. ఈ తమాషా అంతా నోట్ల రద్దు రెండో విడత మాదిరిగా మారనుంది. నోట్ల రద్దు కంటే మించి దారుణ పరిస్థితులను ప్రజలు ఎదుర్కోనున్నారు’ అని రాహుల్‌ అన్నారు. అబద్ధాల కోరు అంటూ బీజేపీ తనపై చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘దేశంలో డిటెన్షన్‌ సెంటర్లు(నిర్బంధ కేంద్రాలు) లేవంటూ ప్రధాని మోదీ చేసిన ప్రసంగం, దానికి జతచేసిన డిటెన్షన్‌ సెంటర్‌ ఫొటోతో నేను చేసిన ట్వీట్‌ను మీరు చూసే ఉంటారు. అబద్ధం చెప్పేది ఎవరో మీరే తేల్చండి’ అని ఆయన పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు