మోదీ మిత్రుడికి 1.30 లక్షల కోట్లు

29 Jul, 2018 04:04 IST|Sakshi

‘రాఫెల్‌’ ఒప్పందంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ధ్వజం   

న్యూఢిల్లీ: భారత దేశం కొనుగోలు చేసిన 36 రాఫెల్‌ యుద్ధ విమానాల నిర్వహణ కోసం ప్రజలు ‘మిస్టర్‌ 56’ స్నేహితుడికి మరో 50 ఏళ్ల పాటు సుమారు లక్ష కోట్ల పన్నులు చెల్లించాల్సి వస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ విమర్శించారు. ఎన్నికల్లో ఛాతీని 56 అంగుళాలకు పెంచి ఉత్సాహంగా మాట్లాడే మోదీ.. పాక్, చైనాలతో చర్చల సమయంలో ఆ ఉత్సాహం ఎందుకు చూపరని కాంగ్రెస్‌ విమర్శించింది. ఈ నేపథ్యంలో మోదీని రాహుల్‌ ‘మిస్టర్‌ 56’గా అభివర్ణించారు.  ‘క్షమించండి.. రాఫెల్‌ కుంభకోణం విలువ రూ. 30 వేల కోట్లు అని గతంలో చెప్పానుగానీ ఆఫ్‌సెట్‌ కాంట్రాక్టులను కలుపుకొంటే ఆ విలువ రూ.1.3 లక్షల కోట్లు’ అని రాహుల్‌ ట్వీట్‌చేశారు. రాఫెల్‌ యుద్ధవిమానాల ఒప్పందంలో మోదీ స్నేహితుడికి 20 బిలియన్ల డాలర్ల (సుమారు 1.30 లక్షల కోట్లు) లబ్ధి చేకూరిందని రాహుల్‌ ఆరోపించారు. ఈ విషయంలో  మోదీ, రక్షణ మంత్రి అబద్ధాలాడుతున్నారని ఆరోపణలు చేశారు.  
మోదీ.. డోక్లాం గురించి మరిచారా? ‘బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలసి పలు అంశాలు చర్చించినా డోక్లాంను ప్రస్తావించడం మరిచారు. ఈ ప్రభుత్వం దేశ సరిహద్దులు, జాతి భద్రత విషయంలో ఎప్పుడు ధైర్యం చేసి మాట్లాడుతుందో.. కళ్లెర్ర జేసి, ఛాతీ 56 అంగుళాలకు పెంచుతుందో.. 132 కోట్ల మంది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు’ అని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది.

>
మరిన్ని వార్తలు