శ్యామ్‌ పిట్రోడా సిగ్గుపడాలి : రాహుల్‌ గాంధీ

13 May, 2019 17:20 IST|Sakshi

చండీగఢ్‌ : 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత శ్యామ్‌ పిట్రోడాపై ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు సిగ్గుపడాలని, జాతి మొత్తానికి క్షమాపణ చెప్పాలని సూచించారు. బీజేపీని విమర్శించే క్రమంలో శ్యామ్‌ పిట్రోడా మాట్లాడుతూ.. ‘1984లో జరిగిందేదో జరిగిపోయింది. అయితే ఇప్పుడేంటి’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌ లక్ష్యంగా బీజేపీ సహా ఇతర పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

చదవండి : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు; అయితే ఇప్పుడేంటి?

ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పంజాబ్‌లోని ఫతేగర్‌ సాహిబ్‌లో పర్యటించిన రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. ‘ 1984 ఘటన గురించి శ్యామ్‌ పిట్రోడా అలా మాట్లాడటం పెద్ద తప్పు. జాతి మొత్తానికి బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పాలి.  ఈ విషయం గురించి ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. మీ వ్యాఖ్యలకు సిగ్గుపడాలని చెప్పాను’  అని పేర్కొన్నారు. కాగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె అంగరక్షకులైన సత్వంత్‌ సింగ్‌, బియాత్‌సింగ్‌లు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది సిక్కు మతస్తులు కావడంతో సిక్కులకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఈ ఘటనలో అనేక మంది సిక్కు సోదరులు అసువులు బాసారు.

మరిన్ని వార్తలు