నా పేరు రాహుల్‌ సావర్కర్‌ కాదు

15 Dec, 2019 01:45 IST|Sakshi

చావనైనా చస్తాను కానీ సారీ చెప్పను

దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ నాశనం చేశారు: రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: దేశంలో అత్యాచారాల గురించి తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కుతగ్గబోనని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్‌ ‘రేప్‌ ఇన్‌ ఇండియా’వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ‘నా పేరు రాహుల్‌ గాంధీ. రాహుల్‌ సావర్కర్‌ కాదు. నేను నిజమే మాట్లాడాను. చావనైనా చస్తాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను’అని ఉద్ఘాటించారు.

దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శనివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భారత్‌ బాచావో ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. తనకు తానుగా దేశభక్తుడిగా అభివర్ణించుకునే ప్రధాని.. ఒంటి చేత్తో ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు.  

ప్రజాస్వామ్య పరిరక్షణకు సమయమిదే: సోనియా
ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్‌ చివరి శ్వాస వరకూ పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పష్టం చేశారు. భారత్‌ బచావో ర్యాలీలో సోనియా మాట్లాడారు. ప్రజలందరూ అన్యాయంపై గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. దేశంలో ప్రస్తుతం అరాచక రాజ్యం నడుస్తోందని, సబ్‌కా సాథ్, సబ్‌ కా వికాస్‌ అన్న అధికార పక్ష నినాదం స్ఫూర్తి ఏదని దేశం మొత్తం ప్రశ్నిస్తోందని ఆమె భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు.   ఈ నాటి అరాచకత్వంపై పోరాడకపోతే మనం చరిత్రలో పిరికివాళ్లుగా మిగిలిపోతామని కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ తన భారత్‌ బచావ్‌ ర్యాలీ ప్రసంగంలో స్పష్టం చేశారు.    

గాంధీ, నెహ్రూల్లానే సావర్కర్‌ కూడా..
రాహుల్‌ ‘సావర్కర్‌’ వ్యాఖ్యలపై శివసేన స్పందించింది. హిందుత్వ సిద్ధాంతాల విషయంలో తమ పార్టీ రాజీపడే ప్రసక్తే లేదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. ‘వీర్‌ సావర్కర్‌ మహారాష్ట్రకు మాత్రమే కాదు.. దేశం మొత్తానికి ఆదర్శనీయమైన వ్యక్తి. నెహ్రూ, గాంధీలకు లాగానే సావర్కర్‌ కూడా దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు. అలాంటి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’అని ట్వీట్‌ చేశారు.

సరిపోయే పేరు.. ‘రాహుల్‌ జిన్నా’: బీజేపీ
ముస్లింల ఓట్ల కోసం రాజకీయాలు చేసే రాహుల్‌కు ‘రాహుల్‌ జిన్నా’అనే పేరు అతికినట్లు సరిపోతుందంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు ‘ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు చేసే నువ్వు మొహమ్మద్‌ అలీ జిన్నా వారసుడివే తప్ప, సావర్కర్‌కు కాదు’అని వ్యాఖ్యానించారు. ‘రాహుల్‌ ఇన్నాళ్లకు నిజం మాట్లాడారు. ఆయన ఎన్నటికీ రాహుల్‌ సావర్కర్‌ కాలేరు. నెహ్రూ–గాంధీ కుటుంబంలో 5వ తరం వ్యక్తి సావర్కర్‌ స్థాయికి సరితూగరు ’అని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్‌ మాల్వీయ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు