బీజేపీ x విపక్ష కూటమి

26 Aug, 2018 03:16 IST|Sakshi

2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమే ప్రతిపక్షాల లక్ష్యం

లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో రాహుల్‌ గాంధీ  

లండన్‌: భారత్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల్ని బీజేపీ, ప్రతిపక్షాల ఐక్య కూటమి మధ్య పోరుగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌అభివర్ణించారు. దేశంలో తొలిసారిగా రాజ్యాంగ సంస్థలపై దాడులు జరుగుతున్నాయని, అందుకే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్నారు. బ్రిటన్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌ శుక్రవారం రాత్రి లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో భారతీయ విద్యార్థులతో ముచ్చటించారు. బీజేపీని ఓడించడం, ప్రభుత్వ సంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ జోక్యాన్ని అడ్డుకోవడమే కాంగ్రెస్‌ పార్టీ మొదటి ప్రాధాన్యమని చెప్పారు.  ‘వచ్చే ఎన్నికల్లో ఒకవైపు బీజేపీ, మరోవైపు ప్రతిపక్ష కూటమి మధ్య ముఖాముఖి పోరు తథ్యం’ అని అన్నారు. ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని చెప్పారు.  

సిక్కు అల్లర్లలో కాంగ్రెస్‌ పాత్ర లేదు: ‘1984లో సిక్కులపై దాడులను 100శాతం ఖండిస్తున్నా. హింసలో భాగస్తులైన వారికి శిక్ష పడడాన్ని  సమర్ధిస్తా. హింసా బాధితుడిగా అది ఏ రూపంలో ఉన్నా నేను వ్యతిరేకం. నేను ప్రేమించినవారు హత్యకు గురవడాన్ని దగ్గరనుండి చూశా. అల్లర్లలో కాంగ్రెస్‌ పాత్ర ఉందన్న మీ వాదనతో నేను ఏకీభవించను’ అని అన్నారు.   వారసత్వ రాజకీయాలపై స్పందిస్తూ.. ‘మా కుటుంబం రాజకీయాల్లో ఉండడం నా రాజకీయ జీవితానికి దోహదపడినా.. ఇతర రాజకీయ నాయకుల్లాగా ఎన్నికల్లో నేను పోరాడుతున్నా’ అని సమాధానమిచ్చారు.

ఎన్నికల కోసం కాంగ్రెస్‌ కీలక కమిటీలు
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ ఈ దిశగా జోరును మరింత పెంచేందుకు మూడు కీలక కమిటీలను శనివారం ఏర్పాటుచేసింది. ఈ కమిటీలు మేనిఫెస్టో రూపకల్పన, ఎన్నికల ప్రచారం అంశాలపై పనిచేస్తాయి. ఈ రెండు బృందాలతోపాటు కీలకమైన కోర్‌టీమ్‌కు కూడా రాహుల్‌ ఆమోదముద్ర పడింది. పార్టీలోని సీనియర్, పాతతరం నేతలకు కోర్‌ టీమ్‌లో చోటు కల్పించారు. ఈ కోర్‌ బృందంలో ఏకే ఆంటోనీ, గులాంనబీ ఆజాద్, పి. చిదంబరం, అశోక్‌ గెహ్లాట్, మల్లికార్జున ఖర్గే, అహ్మద్‌ పటేల్, జైరాం రమేశ్, రణ్‌దీప్‌ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌లు ఉన్నారు.

ఈ బృందం సోనియాగాంధీ నేతృత్వంలో పనిచేస్తుంది. మేనిఫెస్టో కమిటీలో పి. చిదంబరం, హరియాణా మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌ హుడా, మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేశ్, సల్మాన్‌ ఖుర్షీద్, శశిథరూర్, కుమారీ సెల్జా, రణ్‌దీప్‌ సుర్జేవాలాతోపాటుగా 19 సభ్యులున్నారు. 13 మంది సభ్యుల ఎన్నికల పబ్లిసిటీ కమిటీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో రణ్‌దీప్‌ సుర్జేవాలా, ఆనంద్‌ శర్మ, మనీశ్‌ తివారీ, రాజీవ్‌ శుక్లా, భక్త చరణ్‌దాస్, ప్రవీణ్‌ చక్రవర్తి, మిలింద్‌ దేవ్‌రా, కుమార్‌ కేట్కర్, పవన్‌ ఖేరా, వీడీ సతీశన్, జైవీర్‌ షెర్గిల్, ప్రమోద్‌ తివారీ, పార్టీ సోషల్‌ మీడియా హెడ్‌ స్పందనలకు చోటు దక్కింది. ఈ కమిటీలను అశోక్‌ గెహ్లాట్‌ శనివారం ఢిల్లీలో ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు