భారతదేశంలో శ్రమకు గుర్తింపు ఏది?

11 Jun, 2018 16:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘బత్తాయి రసం అమ్ముకునే వ్యక్తి కోకాకోలా కంపెనీ స్థాపనకు కారకుడయ్యాడు. మెకానిక్‌లు నెలకొల్పిన ఫోర్డ్‌, మెర్సిడెస్‌, హోండా సంస్థలు ప్రపంచ దిగ్గజాలుగా ఎదిగాయి. దాబా నడుపుకొనే  అతను మెక్‌డోనాల్డ్స్‌ ఫ్రాంచైజ్‌లు పెట్టగలిగేస్థాయికి ఎదిగాడు. మరి మన భారతదేశంలో? ఇక్కడి కమ్మరి, కుమ్మరి, చాకలి, చర్మకార, నాయీ.. లాంటి వందల కొద్దీ వృత్తులు నిర్వహించే శ్రమకు గుర్తింపు ఉందా? వాళ్లు గౌరవప్రదంగా బతకగలుగుతున్నారా? మూడు పూటలా పట్టెడన్నం తినగలుగుతున్నారా? నోరు తెరిస్తే మన దేశస్తులకు వృత్తినైపుణ్యం(స్కిల్స్‌) లేవని, వాటిని పెంపొందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అంటారు. కానీ అది పచ్చి అబద్ధం. మన వృత్తికారులు ఏ విదేశీయుడి కంటే తక్కువకాదు. కావాల్సిందల్లా వాళ్ల కోసం బ్యాంకుల తలుపులు తెరుచుకోవడమే! ఆ పని చేయగలిగింది ఒక్క కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. బీజేపీలా ఏ 20 మంది బడాబాబులకో దేశాన్ని దోచిపెట్టబోము. బస్సు తాళాలు ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనుల చేతుల్లో పెడతాం..’’ అని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. సోమవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఓబీసీ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

బానిస దేశంగా మార్చారు: ‘‘కష్టపడి పనిచేసేవాడు ఎప్పుడూ వెనుకే ఉండిపోతాడు. రైతులు, కూలీలు నెత్తురు ధారపోసి పనిచేస్తుంటే, లాభాలు మాత్రం వేరొకరు పొందుతున్నారు. స్కిల్స్‌ ఒకరివి.. షోకు ఇంకొకరిది అన్నట్లు తయారైంది పరిస్థితి. గడిచిన నాలుగేళ్లలో 15-20 మంది వ్యాపారవేత్తలకు మాత్రమే బ్యాంకుల నుంచి భారీగా డబ్బులు అందాయి. ప్రధాని కార్యాలయంలో పేదవాడి జాడ కూడ లేదు. ప్రజల్ని బెదిరించి, నోరుమూయించి, ఒకరిద్దరు మాత్రమే బస్సును నడిపిస్తున్నారు. దేశాన్ని ఆర్‌ఎస్‌ఎస్ బానిసగా మోదీ, అమిత్‌షాలు మార్చేశారు. ఓబీసీల మధ్య చిచ్చుపెట్టి, ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, ఇతర కులాల్లోని పేదలంతా ఒక్కటికావాలి. ఆరు నెలలా, ఏడాదా అన్నది లెక్కకాదు. ఏ ముగ్గురో ఇష్టానుసారంగా భారత్‌ను నడిపించలేరని మనం నినదించాలి. దేశాన్ని ప్రజలు, యువకులే నడిపించాలి. ఆ క్రమంలో కాంగ్రెస్‌ అందరితో కలిసి పనిచేస్తుంది. ఎవరి హక్కులు వారికి దక్కేలా ప్రభుత్వాన్ని నడపగల ఏకైక పార్టీ కాంగ్రెసే అన్నది సత్యం’’  అని రాహుల్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు