కాంగ్రెస్‌లో నవశకం.. అధ్యక్షుడిగా రాహుల్‌!

16 Dec, 2017 11:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీలో నూతన శకం ఆరంభమైంది. ​వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ శనివారం పగ్గాలు చేపట్టారు. ఏఐసీసీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన లాంభచనంగా పార్టీ పగ్గాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పూర్వ అధ్యక్షురాలు, తల్లి సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, సోదరి ప్రియాంకగాంధీతోపాటు కాంగ్రెస్‌ పార్టీకి అతిరథ మహరథులు, సీనియర్‌ నేతలు హాజరయ్యారు. పార్టీ 60వ అధ్యక్షుడిగా రాహుల్‌ పగ్గాలు చేపడుతుండటంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. కార్యకర్తల ఆనందోత్సాహాలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.

రాహుల్‌కు ఘనంగా పట్టాభిషేకం!
రాహుల్‌గాంధీ పట్టాభిషేకం ఘనంగా జరిగింది. ఇన్నాళ్లు తల్లి సోనియాగాంధీ చేతుల్లో ఉన్న పార్టీ పగ్గాలను రాహుల్‌ స్వీకరించారు. దీంతో 19 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చారు.  లాంఛనంగా ఇటీవల జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్‌ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. దేశ స్వాతంత్ర్యంలో కీలక పాత్ర పోషించి.. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు గాంధీ-నెహ్రూ కుటుంబంలోని ఐదోతరం వ్యక్తి చేతుల్లోకి వచ్చాయి. గాంధీ-నెహ్రూ కుటుంబంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆరో వ్యక్తి రాహుల్‌.

మరిన్ని వార్తలు