ఏం చేద్దాం.. ఎలా ముందుకెళ్దాం?

15 Aug, 2018 04:02 IST|Sakshi

టీ కాంగ్రెస్‌ సీనియర్లతో భేటీలో రాహుల్‌ గాంధీ

ఒక్కొక్కరి నుంచి వ్యక్తిగత అభిప్రాయాల సేకరణ

అన్నింటినీ సావధానంగా విన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు

అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటానని హామీ 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనే అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్రంలోని పార్టీ సీనియర్లతో చర్చించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు మాజీ మంత్రులు, మాజీ పీసీసీ అధ్యక్షులతో కూడిన 40 మంది నేతలతో ఆయన మంగళవారం ఇక్కడి హరిత ప్లాజాలో సమావేశమయ్యారు. ఒక్కొక్కరి దగ్గరకు విడిగా వెళ్లి రాష్ట్రంలో పార్టీ బలోపేతంతోపాటు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు. ఈ విషయాల్లో ప్రతి ఒక్కరి వ్యక్తిగత అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. నేతలందరూ చెప్పిన విషయాలను సావధానంగా విన్న రాహుల్‌... తెలంగాణలో పార్టీ పరిస్థితిపై పూర్తిస్థాయి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. సీనియర్ల సూచనలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 

రాహుల్‌కు ఎవరేం చెప్పారంటే.... 
- రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులు, కేసీఆర్‌ వైఫల్యాల గురించి వివరించా 
        – జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే 
- బీసీలకు క్రీమీలేయర్‌ ఎత్తేసే అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని, అలా చేస్తే దేశంలోని ఓబీసీలంతా కాంగ్రెస్‌ వైపే నిలుస్తారని చెప్పా. సచివాలయం తరలింపు కోసం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలనూ వివరించా.’     – వి.హనుమంతరావు, మాజీ ఎంపీ 
- మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలను మెమొరాండం రూపంలో తయారు చేసి ఇచ్చాను. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు కూడా అందులో ఉన్నాయి. 18న శక్తియాప్‌ గురించి ఢిల్లీలో జరిగే సమావేశానికి ఆహ్వానించారు. 
    – టి.రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే 
- పార్టీలో మొదటి నుంచీ ఉండి పోరాడుతున్న వాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పా. ప్యారాచూట్‌ లీడర్లు, సైబీరియన్‌ పక్షులు, కొల్లేటి కొంగల్లా వచ్చే నేతలను పార్టీలో చేర్చుకోవద్దని సూచించా. 
    – పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ 
- మహిళలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యమివ్వాలని చెప్పా. 54 శాతం ఉన్న బీసీలకు, గెలిచే వారికి టికెట్లు ఇవ్వాలని కోరా. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళల కోసం అమలు చేసిన పథకాలన్నింటినీ మళ్లీ అధికారంలోకి వచ్చాక అమలు చేయించాలని కోరా. 
    – ఆకుల లలిత, ఎమ్మెల్సీ 
- పార్టీ నిబంధనావళిని ఎంత పెద్ద నాయకుడైనా సరే ఉల్లంఘించకూడదని ఆదేశాలివ్వాలని కోరా. నేతల వివాదాస్పద వ్యాఖ్యలనూ నియంత్రించాలని కోరా. నాలుగేళ్లుగా పార్టీలో ఉన్న పరిస్థితులు వివరించా. పార్టీ కోసం నన్ను ఉపయోగించుకోవాలని కోరా. 
    – ఎస్‌. సంపత్‌కుమార్, ఎమ్మెల్యే 
- పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని అడిగా. పార్టీ వ్యవస్థ మరింత చురుగ్గా పనిచేయాలని, పార్టీలో సమన్వయం ఉండేలా నాయకులకు సూచనలు ఇవ్వాలని కోరా. 
    – మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ మంత్రి 
- చెన్నారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిల హయాంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌కు 51 శాతం సీట్లు రాలేదన్న విషయాన్ని గ్రహించాలని రాహుల్‌కు చెప్పా. దీనిపై లోతుగా విశ్లేషణలు జరగాలని, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలంటే బీసీలు, సెటిలర్ల గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ భాగస్వామ్యం, ఆత్మగౌరవం కల్పించాలని కోరా. 
    – పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి 
- ‘గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని, టికెట్ల కేటాయింపులో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పా. జిల్లాకో బహిరంగ సభ పెట్టే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లా. పార్టీ బలోపేతం గురించి ఢిల్లీ వచ్చి మాట్లాడతానని కోరగా రాహుల్‌ సానుకూలంగా స్పందించారు. 
    – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి 
-  తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయించాలని కోరా. చిన్నచిన్న విషయాలు కొంత ఇబ్బందిని కలిగించినా పార్టీని అధికారంలో కి తెచ్చేందుకు అందరం కృషి చేస్తామని చెప్పా.   
 – డి.కె. అరుణ, మాజీ మంత్రి 
- రాష్ట్ర ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై వ్యతిరేకంగా ఉన్నారని చెప్పా. ప్రభుత్వంలో, పాలనలోనూ భాగస్వామ్యం లేనందున కాంగ్రెస్‌ హయాంలోనే తమ గొంతు వినిపించేదనే భావనలో ప్రజలున్నారని చెప్పా. ఆ భావనను సద్వినియోగం చేసుకునే ప్రణాళిక రూపొందించాలని, బీసీలపై మరింత దృష్టి సారించాలని సూచించా.     
    – వంశీచందర్‌రెడ్డి, ఎమ్మెల్యే 
- స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశాల గురించి చర్చించా. పార్టీ సంస్థాగత బలోపేతంపై రాహుల్‌ చాలా కూలంకష అభిప్రాయంతో ఉన్నారు. 
    – ఉత్తమ్‌ పద్మావతి, ఎమ్మెల్యే. 
- పార్టీలో ఏకాభిప్రాయం ఉన్నచోట్ల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని కోరా. మిగిలిన చోట్ల ప్రజాభిప్రాయం తీసుకుని టికెట్లు ఇవ్వాలని, టికెట్లు రాని నేతలకు మరో రూపంలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరా. పార్టీ సమన్వయ, ప్రచార, మేనిఫెస్టో కమిటీలను ఏర్పాటు చేసి భావసారూప్య పార్టీలతో పొత్తుల అంశాలను పరిశీలించాలని కోరా. 
    – జి.చిన్నారెడ్డి, మాజీ మంత్రి  

మరిన్ని వార్తలు