ఛాతిపై కులం పేరు.. రాహుల్‌ ఆవేదన

30 Apr, 2018 20:18 IST|Sakshi
పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఛాతిపై కులం పేరు

న్యూఢిల్లీ : పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఛాతీపై కులం పేరు రాయడం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇది బీజేపీ ప్రభుత్వ జాత్యహంకార వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వం యువకుల చాతీపై ఎస్సీ, ఎస్టీ అని రాసి రాజ్యాంగంపై దాడి చేసిందన్నారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వచ్చిన ఆలోచననే అని ఆయన ఆరోపించారు. ఇటీవల పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన 200 మంది అభ్యర్థులకు జిల్లా మెడికల్‌ బోర్డు శనివారం వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా అభ్యర్థుల ఛాతీపై ఎస్సీ, ఎస్టీ, జనరల్, ఓబీసీ అని స్కెచ్‌ పెన్‌తో రాశారు.ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు.

ఈ విషయమై ధార్‌ ఎస్పీ వీరేంద్ర సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. వేర్వేరు కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు కావాల్సిన శారీరక ప్రమాణాలు వేర్వేరుగా ఉన్నందున అభ్యర్థుల ఛాతీపై కులం పేరు రాసినట్లు వైద్య సిబ్బంది పోలీసులకు చెప్పారన్నారు. ఏదేమైనా ఇది తీవ్రమైన వ్యవహారమనీ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు