రాహుల్‌ టూర్‌ నేటి నుంచి

13 Aug, 2018 02:01 IST|Sakshi

రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్న ఏఐసీసీ చీఫ్‌

సాక్షి, హైదరాబాద్‌/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేటి నుంచి రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. కాంగ్రె స్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న నాలుగో విడత ప్రజాచైతన్య బస్సు యాత్రకు హాజరవుతున్న ఆయన.. 13, 14 తేదీల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగే పలు సభలు, సమావేశాల్లో పాల్గొననున్నారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో రాహుల్‌ పర్యటనకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు.

మహిళా సంఘాలతో తొలి సమావేశం
ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో తొలిసారి రాష్ట్రానికి రాహుల్‌గాంధీ వస్తున్నారు. సోమవారం మధ్యా హ్నం 2:30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. తర్వాత అక్కడి క్లాసిక్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మహిళా సంఘాలతో తొలుత సమావేశం కానున్నారు. సుమారు గంటపాటు మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టడంతోపాటు తాము అధికారంలోకి వస్తే మహిళల అభ్యున్నతికి ఏం చేస్తామన్నది వివరించనున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును బీజేపీ అడ్డుకుంటున్న తీరు, తెలంగాణ కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేని వైనాన్ని ఆయన ప్రస్తావిస్తారని టీపీసీసీ వర్గాలంటున్నాయి. తర్వాత శేరిలింగంపల్లిలో ఆంధ్ర సెటిలర్లతో రాహుల్‌ సభ నిర్వహించనున్నారు. ఈ రెండు సమావేశాలతోనే తొలిరోజు పర్యటన ముగియనుంది. 

రెండో రోజు బిజీబిజీ
రెండోరోజు ఉదయం కాంగ్రెస్‌ కేడర్, నేతలతో రా హుల్‌ సమావేశమవుతారు. బూత్‌ కమిటీలు, మండ ల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్‌ బేరర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు. వారికి దిశానిర్దేశం చేస్తారు. తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలను కలుస్తారు. అనంతరం ఎడిటర్లతో సమావేశం జరిపి, తాజ్‌కృష్ణ హోటల్‌లో పారిశ్రామిక వర్గానికి చెందిన యువ సీఈవోలతో భేటీ అవుతారు. అనంతరం హరితాప్లాజాకు వెళ్లి కొంత విశ్రాంతి తీసుకుని గన్‌పార్కులోని తెలంగాణ అమర వీరుల స్థూపాన్ని సందర్శిస్తారు. అమరవీరులకు నివాళులర్పిస్తారు. అనంతరం సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే ‘విద్యార్థి, నిరుద్యోగ గర్జన’బహిరంగ సభకు హాజరవుతారు. అంతకుముందు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో గోషామహల్‌కు చెందిన చిరు వ్యాపారులతో సమావేశం కావాల్సి ఉన్నా దాన్ని రద్దు చేశారు. సరూర్‌నగర్‌ సభ అనంతరం ఢిల్లీ వెళ్లిపోతారు.

ఏర్పాట్ల పరిశీలన
రాహుల్‌ పర్యటన సాగే మార్గాలు, మహిళలతో సమావేశమయ్యే క్లాసిక్‌ కన్వెన్షన్‌ వద్ద ఏర్పాట్లను కాంగ్రెస్‌ నేతలు ఆదివారం పరిశీలించారు. ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం, ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతిరెడ్డి, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, నాయకులు కార్తీక్‌రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కన్వెన్షన్‌ హాలులో భారీ వేదికను సిద్ధం చేశారు. 

మరిన్ని వార్తలు