తొలిసారి స్పందించిన రాహుల్‌!

6 Aug, 2019 13:20 IST|Sakshi

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న అధికరణ 370 రద్దుపై రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు మౌనం వీడారు. కశ్మీర్‌ పునర్విభజన బిల్లుపై లోక్‌సభలో వాడివేడి చర్చ జరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి.. జాతీయ భద్రతను సంక్షోభంలోకి నెట్టేసిందని మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను నిర్భందించి... వారిని సంప్రదించకుండా నిర్ణయం తీసుకుని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. భారత దేశం భూములతో నిర్మితం కాలేదని, ప్రజలతో ఏర్పడిందని..ఈ రకంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుని జమ్మూ కశ్మీర్‌ను విడగొట్టడం జాతీయ సమగ్రత అనిపించుకోదు అని ఉద్వేగపూరితంగా ట్వీట్‌ చేశారు.

కాగా జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35-ఏ అధికరణాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. లదాఖ్‌ ప్రాంతాన్ని కూడా జమ్మూ కశ్మీర్‌ నుంచి పూర్తిగా వేరు చేసి, ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. వీటికి సంబంధించిన తీర్మానం, బిల్లులను కేంద్రం సోమవారమే రాజ్యసభలో ఆమోదింపజేసుకుంది. లోక్‌సభలోనూ ఈ బిల్లు ఆమోదం లాంఛనప్రాయం కానుంది. లోక్‌సభలో అధికార ఎన్డీయే కూటమికి 353 మంది సభ్యుల మద్దతు ఉండటంతో భారీ మెజారిటీతో ఈ బిల్లు సభ ఆమోదం పొందనుంది.

మరిన్ని వార్తలు