మహిళా ఓటర్లకు రాహుల్‌ హ్యాట్సాఫ్‌

19 May, 2019 14:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పోటెత్తిన మహిళా ఓటర్లు క్రియాశీలకంగా వ్యవహరించారని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటు చేసిన తల్లులు, సోదరీమణులందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని ఓ వీడియో ట్వీట్‌లో రాహుల్‌ పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో మహిళలు కేవలం అభ్యర్ధులుగానే కాకుండా తమ గొంతుక వినిపించేందుకు కట్టుబడిన ఓటర్లుగానూ కీలకంగా వ్యవహరించిన వారందరికీ తాను శాల్యూట్‌ చేస్తున్నా’నని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

ట్వీట్‌తో పాటు మహిళా ఓటర్లు తమకు సమాన అవకాశాలు, గౌరవం, ఐక్యతతో కూడిన భారతావని కోరుతున్న 30 సెకన్ల నిడివికలిగిన వీడియోను కూడా ఆయన షేర్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రకటించిన న్యాయ్‌ పథకం మహిళలకు దక్కాల్సిన న్యాయపరమైన వాటాను వారికి లభించేలా చేస్తుందని ఈ వీడియోలో మహిళలు అభిప్రాయపడ్డారు. ఏడవ, తుది విడత పోలింగ్‌ ముగియనున్న నేపథ్యంలో రాహుల్‌ మహిళా ఓటర్లకు ధన్యవాదాలు చెబుతూ ఈ ట్వీట్‌ను పోస్ట్‌ చేయడం గమనార్హం. తుదివిడత పోలింగ్‌ ఆదివారం ముగియడంతో ఈనెల 23న ప్రకటించనున్న ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి కేంద్రకృతమైంది.

మరిన్ని వార్తలు